Liquor Scam: లిక్కర్‌ స్కామ్‌లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ అరెస్ట్‌ తప్పదా?

ఢిల్లీ లిక్కర్‌ కేసు కీలక మలుపు తిరుగుతోంది. లిక్కర్‌ స్కాంలో ఈడీ సమన్ల తరువాత ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ భవితవ్యంపై

Update: 2023-11-09 03:42 GMT

ఢిల్లీ లిక్కర్‌ కేసు కీలక మలుపు తిరుగుతోంది. లిక్కర్‌ స్కాంలో ఈడీ సమన్ల తరువాత ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ భవితవ్యంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పార్టీ ఎమ్మెల్యేలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌. ఒకవేళ తనను ఈడీ అరెస్ట్ చేస్తే ఏం చేయాలన్న విషయంలో పార్టీ నేతలతో కేజ్రీవాల్‌ చర్చలు జరుపుతున్నారు. అయతే ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో కేజ్రీవాల్‌కు కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ గతవారం సమన్లు జారీ చేసింది. ఆప్‌ ఎమ్మెల్యేలతో కేజ్రీవాల్‌ గత రెండురోజుల కిందట సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ తనను ఈడీ అరెస్ట్‌ చేస్తే తీహార్‌ జైల్లోనే కేబినెట్‌ సమావేశం నిర్వహిస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు కేజ్రీవాల్‌.

లిక్కర్‌ కేసులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై వివరాలు రాబట్టేందుకు అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అక్టోబర్‌ 30న నోటీసులు జారీ చేసింది. నవంబర్‌ 2న విచారణకు హాజరు కావాలని కోరగా.. ఆయన గైర్హాజరయ్యారు. ఈడీ ఆఫీస్‌కు రాకుండా పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌తో మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్‌ పాల్గొన్నారు.

ఈడీ సమన్లు చట్ట విరుద్దం

ఈడీ సమన్లు చట్టవిరుద్దమని అంటున్నారు కేజ్రీవాల్‌. ఇది కక్షపూరితం, రాజకీయ ప్రేరేపితమని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేసుల్లో కావాలని ఇరికించేందుకు ఇదంతా చేస్తున్నట్లు ఆరోపించారు. బీజేపీ చేస్తున్న తీవ్ర ఒత్తిళ్లతో ఈడీ నోటీసులు పంపించిందని విమర్శలు గుప్పించారు. నోటీసులను ఈవీ వెనక్కి తీసుకోవాలని అన్నారు. మధ్యప్రదేశ్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా నన్ను అడ్డుకునేందుకు ఇప్పుడీ సమన్లు పంపిందని దుయ్యబట్టారు.

ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో లో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియా, ఆప్ రాజ్య‌స‌భ ఎంపీ సంజ‌య్ సింగ్‌ల‌ను ఈడీ ఇప్పటికే అరెస్ట్‌ చేసింది. గత ఏప్రిల్‌లో ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో కేజ్రీవాల్‌ను సీబీఐ 9 గంటల పాటు ప్రశ్నించింది. వ‌చ్చే ఏడాది జ‌రిగే లోక్‌స‌భ ఎన్నిక‌ల ముందు విపక్ష ‘ఇండియా కూట‌మి’ నాయకులను బీజేపీ లక్ష్యంగా చేసుకుందని, ఈ క్రమంలోనే ముందుగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసేందుకు కుట్ర పన్నుతోందని ఆప్‌ నేత‌లు ఆరోపిస్తున్నారు. అయితే ఈ లిక్కర్‌ స్కాంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ అరెస్ట్‌ తప్పదా ? అనే అనుమానాలు కలుగుతున్నాయి. కేజ్రీవాల్‌ అరెస్ట్‌ అయితే ఆప్‌ భవితవ్యం ఏంటన్న విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. 

Tags:    

Similar News