కాంగ్రెస్ చీఫ్ గా నేడు బాధ్యతలు చేపట్టనున్న ఖర్గే

Update: 2022-10-26 02:13 GMT

భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన మల్లికార్జున్ ఖర్గే బుధవారం ఢిల్లీలోని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) ప్రధాన కార్యాలయంలో ఆ పదవిని చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సభ్యులు, ఎంపీలు, ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షులు, సీఎల్‌పీ నేతలు, మాజీ సీఎంలు, రాష్ట్ర మాజీ అధ్యక్షులు, ఇతర ఏఐసీసీ ఆఫీస్‌ బేరర్లను ఆహ్వానించారు. ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ ద్వారా ఇప్పటికే ఆహ్వానం పంపబడింది. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్‌ను కూడా ఈ కార్యక్రమానికి పిలిచారు.

పార్టీ అత్యున్నత పదవి రేసులో ఖర్గే తన ప్రత్యర్థి శశి థరూర్‌ను భారీ తేడాతో ఓడించి, 24 ఏళ్ల తర్వాత ఆ పదవిని చేపట్టిన మొదటి గాంధీయేతర వ్యక్తిగా నిలిచారు. అక్టోబర్ 17న జరిగిన ఓటింగ్‌లో ఖర్గేకు 7,897 ఓట్లు రాగా, ఆయన ప్రత్యర్థి థరూర్‌కు 1,072 ఓట్లు వచ్చాయి. థరూర్‌కు అభినందనలు తెలిపిన ఆయన, పార్టీని ముందుకు తీసుకెళ్లే విధానాలపై చర్చించామని చెప్పారు. ఖర్గే విజయం సాధించినందుకు అభినందనలు తెలిపేందుకు థరూర్ ఆయన నివాసాన్ని వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సోనియా గాంధీ కూడా మల్లికార్జున్ ఖర్గే ఇంటికి వెళ్లడం విశేషం.


Tags:    

Similar News