'డార్లింగ్' అని పిలిస్తే జైలుకే!!

పరిచయం లేని మహిళలను డార్లింగ్ అని పిలిచి కష్టాలు తెచ్చుకోకండి

Update: 2024-03-03 09:36 GMT

సోషల్ మీడియాలో కానీ.. బయట కానీ.. ఎవరైనా పరిచయం అయితే చాలు.. అంతా మనోళ్లే అని అనుకుంటూ ఉంటారు. మావా అనో.. బాబాయ్ అనో.. భయ్యా అనో.. ఇలా ఎన్నో పదాలను ఉపయోగిస్తూ ఉంటారు. ఇక కొందరు ఊతపదం కూడా డార్లింగ్ అయి ఉండొచ్చు. అయితే.. ఆ పదాన్ని వాడే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే!! ఎవరిని పడితే వాళ్లను.. ముఖ్యంగా మహిళలను డార్లింగ్ అంటూ పిలిచారంటే.. అది లైంగిక వేధింపు కిందకు వస్తుంది. దీంతో మీరు ఊచలు లెక్కపెట్టక తప్పదు.

పరిచయం లేని మహిళలను డార్లింగ్ అని పిలిచి కష్టాలు తెచ్చుకోకండి. ఎందుకంటే కలకత్తా హైకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు ఎంతో మందిని షాక్ కు గురిచేస్తూ ఉంది. కోల్ కతాలో దుర్గాపూజ సందర్భంగా బందోబస్తు కోసం మహిళా పోలీసులను కూడా ఉంచుతారు. ఓ వ్యక్తి మహిళా కానిస్టేబుల్ దగ్గరకు వెళ్లి డార్లింగ్ అని పిలిచాడు. ఆ మహిళా పోలీసు ఆ వ్యక్తిపై మాయాబందర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అధికారులు అతడిపై కేసు నమోదు చేశారు. కేసు విచారణ సందర్భంగా కలకత్తా హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఏ మాత్రం పరిచయం లేని ఓ మహిళను డార్లింగ్ అని పిలవడం లైంగిక వేధింపు కిందికి వస్తుందని తేల్చి చెప్పింది. అలా పిలిచిన వారిని ఐపీసీ 354ఏ, 509 సెక్షన్ల కింద విచారించే అవకాశం ఉందని హెచ్చరించింది. పరిచయం లేని మహిళ పట్ల డార్లింగ్ అనే పదాన్ని ఉపయోగించడం అసభ్యత కిందికి వస్తుందని కలకత్తా హైకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. "పోలీసు కానిస్టేబుల్ అయినా కాకపోయినా, వీధిలో ఒక వ్యక్తి, మద్యం తాగినా.. తాగకున్నా తెలియని మహిళను ఉద్దేశించి 'డార్లింగ్' అనే పదాన్ని ఉపయోగించడం చాలా అభ్యంతరకరమైనదని బెంచ్ పేర్కొంది. డార్లింగ్ అని పిలవడం భారతీయ సమాజ ప్రమాణాలకు సంబంధించినది కాదని జస్టిస్ సేన్‌గుప్తా అన్నారు.


Tags:    

Similar News