రెండు గుండెలు, నాలుగు కాళ్లు, నాలుగు చేతులతో శిశువు జననం

ఆ మహిళకు సాధారణ ప్రసవమే అయిందని, ఆమె ఆరోగ్యంగానే ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ వింత శిశువు జననంపై..

Update: 2023-03-07 06:00 GMT

రెండు గుండెలు, నాలుగు కాళ్లు, నాలుగు చేతులతో ఓ వింత శిశువు జన్మించింది. పుట్టిన అరగంటలోపే ఆ శిశువు కన్నుమూసింది. ఈ ఘటన రాజస్థాన్ లోని చురు జిల్లా రతన్ గఢ్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో జరిగింది. హజారీ సింగ్ అనే 19 ఏళ్ల మహిళ పురిటినొప్పులతో ఆదివారం (మార్చి5) రాత్రి గంగారామ్ ఆస్పత్రిలో చేరింది. వైద్యులు ఆమెకు సోనోగ్రఫీ నిర్వహించగా.. కడుపులో వింత శిశువు కనిపించింది. దానిని చూసి వారంతా ఆశ్చర్యపోయారు. శిశువుకు రెండు గుండెలు, నాలుగు చేతులు, నాలుగు కాళ్లతోపాటు రెండు వెన్నెముకలు ఉన్నట్టు వైద్యులు తెలిపారు.

అయితే శిశువుకి తల ఒక్కటే ఉందని తెలిపారు. రెండు గుండెలతో పుట్టిన ఆ శిశువుకి హృదయ స్పందన తక్కువగా ఉండటంతో 20 నిమిషాలకే మరణించినట్టు వెల్లడించారు. ఆ మహిళకు సాధారణ ప్రసవమే అయిందని, ఆమె ఆరోగ్యంగానే ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ వింత శిశువు జననంపై డాక్టర్ రీటా సొంగరా మాట్లాడుతూ.. ఇతర ఆస్పత్రుల్లో ఆమెకు సోనోగ్రఫీ చేసినపుడు సాధారణ రిపోర్టులు వచ్చాయని, తమ ఆస్పత్రిలో సోనోగ్రఫీ చేయగా.. వింత శిశువుగా కనిపించిందన్నారు. ఇలాంటి డెలివరీ చేయడం చాలా కష్టమైనప్పటికీ.. నార్మల్ డెలివరీ అవడం ఆమె అదృష్టమేనన్నారు. ఇలాంటి డెలివరీని ‘కంజుక్టివల్ అనోమలీ’ అంటారని, క్రోమోజోముల వల్ల అవయవాలు ఇలా అధికంగా ఏర్పడవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు.


Tags:    

Similar News