ఆశా వర్కర్ కృషికి ఫోర్బ్స్ గుర్తింపు.. 2021 జాబితాలో స్థానం

ఒడిశాకి చెందిన ఆశావర్కర్ మతిల్దా కుల్లు ఫోర్బ్స్ ఇండియా డబ్ల్యూ పవర్ 2021 జాబితాలో స్థానం సంపాదించుకున్నారు

Update: 2021-12-04 06:23 GMT

ఆమె కృషికి ఫోర్బ్స్ ఫిదా అయింది. వృత్తి పట్ల ఆమె ఎంత నిబద్ధతగా ఉందో గుర్తించింది. ఫలితంగా ఫోర్బ్స్ ఇండియా డబ్ల్యూ పవర్ 2021 జాబితాలో స్థానం సంపాదించింది. ఆమె పేరే మతిల్దా కుల్లు. ఒడిశాలోని సుందర్ గఢ్ జిల్లా గర్ గండ్ బహల్ గ్రామానికి చెందిన గిరిజన ఆశావర్కర్ ఆమె. 15 సంవత్సరాలుగా మతిల్దా ఈ వృత్తిలోనే కొనసాగుతున్నారు. ఆ గ్రామంలో సుమారు 1000 మంది నివాసితులుండగా.. వారందరి బాగోగులను మతిల్దా ఒక్కరే చూసుకుంటారు.

ఉదయం ఐదు గంటల నుంచి....
ప్రతి రోజు 5 గంటలకే మతిల్దా దినచర్య ప్రారంభమవుతుంది. ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకుని, కుటుంబ సభ్యులకు కావాల్సినవన్నీ సమకూర్చి.. సైకిల్ పై ఊర్లోకి వెళ్తారు. సైకిల్ పై ఊరంతా తిరుగుతూ..వ్యాక్సిన్లు వేయించడం, పౌష్టికాహారం అందించడం..గ్రామం పరిశుభ్రంగా ఉండేందుకు మతిల్దా చర్యలు చేపట్టారు. ఏ ఇంట్లో వారికి అనారోగ్యంగా ఉందని తెలిసినా ఆమె వారి వద్దకు వెళ్లి మందులిస్తారు. గర్భిణీలకు కూడా సహాయం చేస్తారు.
ఫ్రంట్ లైన్ వర్కర్ గా....
అంతేకాకుండా కరోనా విజృంభణ సమయంలోనూ మతిల్దా ఫ్రంట్ లైన్ వర్కర్ గా ఎనలేని సేవలందించారు. ఎన్నో ప్రాణాలు కాపాడారు. ఆఖరికి తనకు కూడా కరోనా సోకింది. పట్టుదలతో దాని నుంచి కోలుకుని వృద్ధ మహిళలు, పురుషులను టీకాలు వేసేందుకు టీకా కేంద్రాలకు తరలించేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. ఇంత కష్టపడుతున్న మతిల్దాకు నెలకు వచ్చే జీతం రూ.4,500 మాత్రమే. జీతం తక్కువే కదా అని వృత్తిని చులకనగా, నిర్లక్ష్యంగా చూడలేదు. ఆశావర్కర్ గా పనిచేయడం తనకు ఎంతో సంతోషాన్నిస్తుందని, ఈ వృత్తి అంటే తనకు చాలా ఇష్టమని, అందుకే ప్రజల కోసం ఇంత కృషి చేస్తున్నట్లు మతిల్దా కుల్లు పేర్కొన్నారు. ప్రజల రక్షణ కోసం మతిల్దా చేస్తున్న కృషి ఫోర్బ్స్ చెవిన పడింది. అంతే ఆమెకు స్వశక్తివంతులైన మహిళల జాబితాలో చోటు ఇచ్చింది. ఈ విషయం తెలుసుకున్న ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ మతిల్దా కు అభినందనలు తెలిపి, సంతోషం వ్యక్తం చేశారు


Tags:    

Similar News