ఆ విషాదం తర్వాత.. వేల మందికి ఉచితంగా ఈతలో శిక్షణ

ఈత నేర్చుకోవడం చాలా ముఖ్యమని అంటూ ఉంటారు.

Update: 2025-07-10 10:15 GMT

ఈత నేర్చుకోవడం చాలా ముఖ్యమని అంటూ ఉంటారు. కొన్ని అనుకోని ప్రమాదాల సమయంలో ఈత నేర్చుకుని ఉంటే ఎంతో మంది ప్రాణాలు నిలబడి ఉండేవి. 2009లో ఓ బోటు మునిగిపోయి 45 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో చలించిపోయిన కేరళకు చెందిన సాజీ వళస్సెరిల్‌ నీటి ప్రమాదాల సమయంలో ప్రాణనష్టాన్ని నివారించాలనే లక్ష్యంతో ఉచితంగా ‘ఈత’ తరగతులకు మొదలుపెట్టారు. దాదాపు 16 ఏళ్లలో ఏకంగా 15 వేలమందికి పైగా శిక్షణ అందించారు.

కేరళలోని ఆళువాలో ఓ ఫర్నీచర్‌ దుకాణం నిర్వహించే సాజీ ఆరేళ్ల వయసులో తన తండ్రి నుంచి ఈత నేర్చుకున్నారు. 2007లో తన ఇద్దరు పిల్లలతోపాటు మరో ఇద్దరికి స్విమ్మింగ్‌ నేర్పించారు. ఆయన గురించి తెలిసి స్విమ్మింగ్ క్లాసుల కోసం వచ్చే స్థానికుల రాక పెరిగింది. పెరియార్‌ నదిలోని ‘మణప్పురం దేశం కడవు’లో ఉదయాన్నే 4.30 గంటలకు స్విమ్మింగ్‌ తరగతులు మొదలవుతాయి. రోజూ రెండు బ్యాచ్‌లలో వెయ్యి మంది శిక్షణ పొందుతుంటారు. ట్రైనింగ్‌ పూర్తి చేసుకున్న వారు గ్రూప్ లీడర్లుగా వ్యవహరిస్తూ.. కొత్తవారిని పర్యవేక్షిస్తుంటారు. తరగతులు ఉచితమైనప్పటికీ నెలకు 100 రూపాయల చొప్పున స్వచ్ఛందంగా చెల్లించొచ్చు.

Tags:    

Similar News