ఎన్ కౌంటర్ లో హతమైన లింగవ్వ అలియాస్ మధు

Update: 2022-12-24 02:35 GMT

ఆదిలాబాద్: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దామ్రాంచలోని టేకమెట అడవుల్లో శుక్రవారం నక్సలైట్లు, సాయుధ బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. ఛత్తీస్గఢ్ పోలీసులు విడుదల చేసిన ప్రెస్ నోట్ ప్రకారం.. నిర్మల్ జిల్లా కడ్డంపెద్దూరు మండలం లక్ష్మీసాగర్ గ్రామానికి చెందిన కంఠి లింగవ్వ అలియాస్ అనిత (41) మృతి చెందినట్లు తెలిపారు. ఛత్తీస్గఢ్– మహారాష్ట్రల సరిహద్దులోని బీజాపూర్ జిల్లా అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మహిళా డివిజనల్ కమిటీ(డీవీసీ) కమాండర్ సహా ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఎన్కౌంటర్లో తెలంగాణ మావోయిస్టు నేత మైలారపు అడెళ్లు అలియాస్ భాస్కర్ భార్య కణితి లింగవ్వ (40) అలియాస్ అనిత మృతి చెందినట్టు సమాచారం.

రెండు రాష్ట్రాల పోలీసులతో పాటు మహారాష్ట్రకు చెందిన సీ–60 కమాండోలు, బీజాపూర్కు చెందిన బలగాలు సంయుక్తంగా కూంబింగ్ నిర్వహిస్తుండగా నేషనల్ పార్క్ టకామెటా ప్రాంతంలో మావోయిస్టులు ఎదురుపడటంతో ఎన్కౌంటర్ జరిగింది. ఘటనాస్థలం నుంచి మావోయిస్టుల మృతదేహాలతోపాటు ఆటోమేటిక్ రైఫిల్ను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నారు. మూడు రాష్ట్రాలకు మోస్ట్ వాంటెడ్గా ఉన్న నిర్మల్ జిల్లాకు చెందిన మావోయిస్టు మైలారపు ఆడెళ్లు అలియాస్ భాస్కర్ భార్య కంతి లింగవ్వ అలియాస్ అనిత తలపై తెలంగాణలో రూ.5 లక్షలు, మహారాష్ట్రలో రూ.16 లక్షలు నజరానా ఉన్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. గోదావరి పరీవాహక ప్రాంతమైన లక్ష్మీసాగర్కు చెందిన కణితి లింగవ్వ అప్పట్లో నక్సల్స్ దళాలకు ఆకర్షితురాలై 1997లో యుక్తవయసులోనే దళంలో చేరింది. లింగవ్వ తమ్ముడు కంతి రవి అలియాస్ సురేశ్ సైతం కొన్నాళ్లు దళంలో పనిచేసి 2016లో పోలీసులకు లొంగిపోయాడు. లింగవ్వ మాత్రం భర్త అడెల్లుతోనే దళంలోనే కొనసాగింది.


Tags:    

Similar News