మాజీ సీఎం భార్యపై గృహహింస కేసు
హిమాచల్ ప్రదేశ్ పీసీసీ చీఫ్ ప్రతిభా సింగ్, ఆమె కుమారుడు విక్రమాదిత్యపై గృహహింస కేసు నమోదు కావడం సంచలనంగా మారింది.
ఆమె మాజీ ముఖ్యమంత్రి భార్య. కుమారుడు ఎమ్మెల్యే. ప్రస్తుతం ఆమె కూడా ఎమ్మెల్యేనే. అయితే ఆమెపై గృహహింస కింద కేసు నమోదయింది. హిమాచల్ ప్రదేశ్ పీసీసీ చీఫ్ ప్రతిభా సింగ్, ఆమె కుమారుడు విక్రమాదిత్యపై రాజస్థాన్ లో గృహహింస కేసు నమోదు కావడం సంచలనంగా మారింది. ఇటీవల హిమాచల్ ప్రదేశ్ కు జరిగిన ఎన్నికల్లో ప్రతిభాసింగ్, విక్రమాదిత్యలు ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఒక దశలో ప్రతిభాసింగ్ పేరు కూడా ముఖ్యమంత్రి రేసులో వినిపించింది. చివరి నిమిషంలో ఆమె తాను సీఎం రేసు నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.
వేధింపులకు గురి చేస్తున్నారంటూ...
ఎక్కువ మంది ఎమ్మెల్యేలు సుఖ్విందర్ సింగ్ వైపు ఉండటంతో ఆమె తనంతట తాను పోటీ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆమె వివాదంలో చిక్కుకోవడం కాంగ్రెస్ కు ఇబ్బందిగా మారింది. 2019 లో వీరభద్రసింగ్ కుమారుడు విక్రమాదిత్యకు, రాజస్థాన్ కు చెందిన సుదర్శన సింగ్ చుండావత్ తో వివాహమయింది. అయితే పెళ్లయిన కొద్దిరోజులకే తనపై వేధింపులకు పాల్పడ్డారని సుదర్శన సింగ్ ఆరోపిస్తున్నారు. ఆమె ఉదయపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను మానసికంగా వేధింపులకు గురిచేయడమేకాకుండా శారీరకంగా హింసించారంటూ ఫిర్యాదు చేశారు.
వివాహేతర సంబంధం పెట్టుకుని...
తన భర్త విక్రమాదిత్యకు చంఢీగడ్ కు చెందిన ఒక యువతితో వివాహేతర సంబంధం ఉందని, అందుకోసమే తనను వేధిస్తున్నారని ఆమె ఆరోపించారు. తల్లీ, కొడుకులు ఇద్దరూ తనను మానసికంగా వేధించేవారని, తన మామ వీరభద్రసింగ్ మరణించిన తర్వాత మరింత వేధింపులకు పాల్పడ్డారన్నారు. తనను బలవంతంగా పుట్టింటికి పంపారని ఆమె చెప్పారు. దీనిపై పోలీసులు కేసు నమోదుచేసి ప్రతిభా సింగ్, విక్రమాదిత్యలకు నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. తనకు భరణం ఇప్పించాలని ఆమె న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించనున్నారని తెలిసింది.