ట్విస్టుల మీద ట్విస్టులు.. తిరుగుబాటు ఎమ్మెల్యేల లేఖలో ఏముందో తెలుసా..?

నాకేమీ అనారోగ్యం లేకున్నా.. గుండెపోటు వచ్చిందంటూ బలవంతంగా ఆస్పత్రికి తరలించారని అన్నారు.

Update: 2022-06-22 12:31 GMT

మహారాష్ట్ర రాజకీయాల్లో ఊహించని మార్పులు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని రెబెల్ ఎమ్మెల్యేలు మహారాష్ట్ర గవర్నర్ కు, డిప్యూటీ స్పీకర్ కు రాసిన లేఖ కారణంగా ఉద్ధవ్ థాకరేకు ఊహించని షాక్ తగిలింది. ఉద్ధవ్ సర్కారుపై షిండే తిరుగుబాటు చేయగానే ఆయనను శాసనసభా పక్ష నేత హోదా నుంచి తొలగిస్తున్నట్టు పార్టీ ప్రకటించింది. కానీ తమదే అసలైన శివసేన శాసనసభా పక్షం అంటూ తిరుగుబాటు ఎమ్మెల్యేలు గవర్నర్ కు లేఖ రాశారు. 'శివసేన పార్టీకి మహారాష్ట్ర శాసనసభలో మొత్తం 57 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో 34 మందిమి ఏక్ నాథ్ షిండే వెనుకే ఉన్నాం. ప్రభుత్వంలో అవినీతి జరుగుతోంది. వ్యక్తిగత అవసరాల కోసం పార్టీ నేతలను ఇబ్బంది పెడుతున్నారు. అందుకే తిరుగుబాటు చేస్తున్నాం' అని లేఖలో చెప్పుకొచ్చారు. అసెంబ్లీలో శివసేన మాదే.. ఏక్ నాథ్ షిండే శాసనసభా పక్ష నేతగా కొనసాగుతారు. పార్టీ చీఫ్ విప్ గా భరత్ గొగవాలేను నియమించుకున్నామని తెలిపారు. పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహిస్తున్నామని.. దానికి హాజరుకాకుంటే పార్టీని వీడినట్టుగా భావిస్తామన్న శివసేన ఆదేశాలు చెల్లబోవని తిరుగుబాటు నేత ఏక్ నాథ్ షిండే ప్రకటించారు. తమదే అసలైన శివసేన అని ఆయన చెప్పుకొచ్చారు.

తిరిగొచ్చిన ఎమ్మెల్యే నితిన్ దేశ్ ముఖ్ సంచలన ఆరోపణలు చేశారు. తనను కిడ్నాప్ చేసి బలవంతంగా గుజరాత్ కు తీసుకెళ్లారని.. వారి నుంచి తప్పించుకుని వచ్చానని ప్రకటించారు. ''నన్ను ఏక్ నాథ్ షిందే తప్పుదోవ పట్టించారు. సీఎంకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్న విషయం నాకు చెప్పలేదు. సూరత్ తీసుకెళ్లాక నాకు అసలు విషయం తెలిసింది. వెంటనే హోటల్ నుంచి బయటికి వస్తుంటే.. పోలీసులు అడ్డుకున్నారు." అని చెప్పారు. నాకేమీ అనారోగ్యం లేకున్నా.. గుండెపోటు వచ్చిందంటూ బలవంతంగా ఆస్పత్రికి తరలించారని అన్నారు. ఏదో ఇంజెక్షన్ ఇవ్వడానికి ప్రయత్నించారని.. వారి నుంచి ఎలాగోలా తప్పించుకుని ముంబైకి వచ్చానన్నారు. నేను ఎప్పటికీ శివసేన సైనికుడినేనని.. ఉద్ధవ్ కే నా మద్దతని ప్రకటించారు.


Tags:    

Similar News