అత్యాచారం, హత్య కేసులో 33 ఏళ్ల వ్యక్తికి మరణశిక్ష

డిసెంబర్ 21, 2019 రాత్రి కరివాలి గ్రామంలోని సుభాష్ నగర్ ప్రాంతంలోని తన ఇంటి దగ్గర ఆడుకుంటున్న సమయంలో నిందితుడు బాలికను..

Update: 2022-04-21 05:31 GMT

థానే : 2019లో ఏడేళ్ల బాలికను కిడ్నాప్ చేసి, అత్యాచారం చేసి.. హత్య చేసిన కేసులో 33 ఏళ్ల వ్యక్తికి థానేలోని ప్రత్యేక పోక్సో కోర్టు బుధవారం మరణశిక్ష విధించింది. మహారాష్ట్రలోని థానే జిల్లాలోని భివాండి ప్రాంతానికి చెందిన భరత్ కుమార్ ధనిరామ్ కోరి అనే వ్యక్తి పోర్టర్‌గా పనిచేస్తున్నాడు. అతడు బాలికపై దారుణానికి ఒడిగట్టాడు. ప్రత్యేక పోక్సో న్యాయమూర్తి కెడి షిర్బాటే ధనిరామ్ ను నిందితుడేనని తీర్పు ఇచ్చారు. లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం మరియు భారత శిక్షాస్మృతి కింద దోషిగా నిర్ధారించారు. కోర్టు అతనికి రూ.10,000 జరిమానా కూడా విధించింది. ఈ కేసును "అరుదైనది"గా పేర్కొంటూ, మైనర్ బాలికను కిడ్నాప్, అత్యాచారం, హత్య చేసినందుకు కోరికి న్యాయమూర్తి మరణశిక్ష విధించారు.

ఈ కేసు విచారణ సందర్భంగా ప్రాసిక్యూషన్ 25 మంది సాక్షులను విచారించినట్లు పిటిఐ నివేదించింది. డిసెంబర్ 21, 2019 రాత్రి కరివాలి గ్రామంలోని సుభాష్ నగర్ ప్రాంతంలోని తన ఇంటి దగ్గర ఆడుకుంటున్న సమయంలో నిందితుడు బాలికను అపహరించినట్లు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సంజయ్ మోరే కోర్టుకు తెలిపారు. బాధితురాలి తండ్రి భివాండి నగరంలో ఓ తినుబండారం షాప్ నడుపుతున్నట్లు ప్రాసిక్యూషన్ కోర్టుకు తెలియజేసింది. ఐస్‌క్రీం ఇస్తానని హామీ ఇచ్చి రెండో తరగతి చదువుతున్న బాలికను ప్రలోభపెట్టి ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక అతడిని ప్రతిఘటించడంతో.. ఆమె తలపై రాయితో కొట్టి అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో బాలిక అక్కడికక్కడే మృతి చెందింది. ఇంటి దగ్గర ఆమె కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆమె ఆచూకీ కోసం వెతకడం ఫలించలేదు. అనంతరం గ్రామంలోని ఓ నిర్మానుష్య ప్రదేశంలో ఆమె మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఘటనా స్థలం నుంచి రాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై విచారణ ప్రారంభించి నిందితుడిని పట్టుకున్నారు. కోరి IPCలోని 364 (హత్య చేయడానికి కిడ్నాప్ లేదా అపహరణ), 376 (అత్యాచారానికి శిక్ష), మరియు 302 (హత్యకు శిక్ష) మరియు లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టంతో సహా అనేక సెక్షన్ల కింద దోషిగా నిర్ధారించబడ్డాడు.


Tags:    

Similar News