Plane Crash : అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో 274కు చేరిన మృతులు

అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదంలో 274 మంది మరణించారు.

Update: 2025-06-14 04:06 GMT

అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదంలో 274 మంది మరణించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి. ఈ నెల 12వ తేదీన అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం అహ్మదాబాద్ లో కూలిన ఘటనలో వందల సంఖ్యలో మరణించారు. ఆసుపత్రి హాస్టల్ భవనంపై పడటంతో మెడికోలు కూడా మరణించారు. ఇప్పటి వరకూ మరణించిన 274 మందిలో 241 మంది విమాన ప్రయాణికులు, సిబ్బంది ఉండగా, విమానం కూలడంతో 33 మంది పౌరులు చనిపోయినట్లు ప్రభుత్వం అధికారికంంగా వెల్లడించింది.

33 మంది ఇతరులు...
విమానం టేకాఫ్ అయిన కొద్ది సెకన్లలోనే బీజే మెడికల్ కళాశాల క్యాంపస్ పై పడిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న ఒక్క ప్రయాణికుడు మినహా అందరూ మరణించారు. అదే సమయంలో లంచ్ అవర్ కావడంతో మెడికోలు హాస్టల్ భవనంలో లంచ్ చేస్తుండగా విమానం కూలడంతో అక్కడికక్కడే ఇరవై మంది మరణించారని, తర్వాత ఆ సంఖ్య ముప్ఫయి మూడుకు చేరిందని అధికారులుతెలిపారు. అయితే ఈ ముప్ఫయి మూడు మందిలో కేవలం మెడికోలు మాత్రమే కాకుండా మెఘాని నగర్ ప్రాంతానికి చెందిన వారు కూడా ఉండే అవకాశముంటుందని తెలిపింది.
హై లెవెల్ కమిటీని...
మృతుల కుటుంబాలకు డీఎన్ఏ ఆధారంగా మృతదేహాలను అప్పగిస్తున్నారు. ఆ ప్రక్రియ కొనసాగుతుంది. మరొక వైపు విమాన ప్రమాదంపై ఉన్నతస్థాయి దర్యాప్తు కొనసాగుతుంది.ఇందుకోసం మల్టీ డిసిప్లినరీ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు పౌర విమానయాన శాఖ వెల్లడించింది. విమానానికి సంబంధించిన బ్లాక్ బాక్స్ కూడా దొరకడంతో దానిని విశ్లేషించిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశాలున్నాయి. అయితే ఈ ప్రమాదం జరగడానికి సాంకేతికలోపమా? మరేదైనా కారణమా? అన్న కోణంలోనూ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. భారత పౌర విమానయాన చరిత్రలో అతి పెద్ద విషాద ఘటన కావడంతో దిద్దుబాటు చర్యలను కూడా డీజీసీఏ ఆదేశాల మేరకు ఎయిర్ ఇండియా చర్యలను ప్రారంభించింది.


Tags:    

Similar News