20000 మంది భారతీయులు చనిపోయారు: పర్వతనేని హరీష్
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఘోరమైన ఉగ్రవాద దాడి తర్వాత
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఘోరమైన ఉగ్రవాద దాడి తర్వాత సింధు జలాల ఒప్పందం నిలిపివేసినట్లుగా పాకిస్తాన్ తప్పుడు సమాచారం ఇచ్చిందని భారతదేశం స్పష్టం చేసింది. పాకిస్తాన్ ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం కారణంగా 65 ఏళ్ల నాటి ఒప్పందాన్ని నిలిపివేసినట్లు ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి, రాయబారి పర్వతనేని హరీష్ స్పష్టం చేశారు. పాకిస్తాన్ ప్రతినిధి నీరు యుద్ధ ఆయుధం కాదని ఐక్యరాజ్యసమితిలో ఈ అంశాన్ని లేవనెత్తిన తర్వాత పర్వతనేని హరీష్ ఘాటుగా పాకిస్థాన్ కు రిప్లై ఇచ్చారు. పహల్గామ్ దాడిలో 26 మంది మరణించిన ఒక రోజు తర్వాత ఏప్రిల్ 23న 1960లో సంతకం చేసిన ఒప్పందాన్ని భారతదేశం నిలిపివేసింది. భయంకరమైన ఉగ్రవాద దాడికి పాకిస్థాన్ కు సంబంధాలు ఉన్నట్లు కనుగొన్న తర్వాత న్యూఢిల్లీ ఈ చర్యలు తీసుకుంది.
ఆరున్నర దశాబ్దాలుగా, పాకిస్తాన్ భారతదేశంపై మూడు యుద్ధాలు చేయడమే కాకుండా, వేలాది ఉగ్రవాద దాడులకు కారణమైందని, ఆ ఒప్పందం స్ఫూర్తిని ఉల్లంఘించిందని హరీష్ తెలిపారు. గత నాలుగు దశాబ్దాలలో 20,000 మందికి పైగా భారతీయులు ఉగ్రవాద దాడుల్లో మరణించారని కూడా ప్రపంచానికి తెలిపారు పర్వతనేని హరీష్. భారతదేశంలో పాకిస్తాన్ ప్రభుత్వ ప్రాయోజిత సీమాంతర ఉగ్రవాదం పౌరుల జీవితాలను, మత సామరస్యాన్ని, ఆర్థిక శ్రేయస్సును దెబ్బతీయడానికి ప్రయత్నిస్తుందని ఆయన అన్నారు.