పుట్టిపెరిగింది తెలుగు గడ్డపైనే అయినప్పటికీ వెండితెరపై కథానాయికగా తెలుగు చిత్ర పరిశ్రమలో కంటే తమిళ చిత్రాలతోనే ఎక్కువ అవకాశాలు తద్వారా ఎక్కువ విజయాలు అందుకుని వరుస తమిళ, మళయాళ చిత్రాలతో బిజీగా గడుపుతుంది అంజలి. ఎక్కువగా వార్తలలో కనిపించని ఈ భామ ఈ మధ్యనే అడపాదడపా తన బాయ్ ఫ్రెండ్, తమిళ హీరో జై తో మరీ సన్నిహితంగా వుంటూ మీడియా కెమెరాలకు చిక్కుతుంది. పూర్తిగా తమిళ సినిమాలతో బిజీ ఐపోవటంతో తెలుగు ప్రేక్షకులకి అంజలికి గ్యాప్ బాగానే పెరిగిపోయింది. పైగా అంజలి ఈ మధ్య కాలంలో చేసిన చిత్రంగధ అనే తెలుగు చిత్రం డిసాస్టర్ కావటం తో తెలుగు ప్రేక్షకుల దృష్టిలో అంజలి మెదలటం లేదు.
అయితే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, బలుపు వంటి హిట్ చిత్రాలలో తెలుగు వారిని మెప్పించిన అంజలి ని మన వాళ్ళు బొద్దుగా, పుష్టిగా ఉన్న రూపాన్నే గుర్తుచేసుకుంటారు. కానీ తాజాగా తన అభిమానులకి, సినిమా ప్రేక్షకులకి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ తన లేటెస్ట్ ఫొటోతో దర్శనమిచ్చిన అంజలి ని చూసి అందరూ షాక్ అవ్వాల్సిందే. బాగా స్లిమ్ గా తయారై చక్కని చీరకట్టుతో ప్రేక్షకులకి పండుగ శుభాకాంక్షలు తెలిపింది. మరి ఈ స్లిమ్ లుక్ తో అంజలి కనిపించబోయే తొలి చిత్రం ఏమిటో తెలియాల్సి వుంది.