మహేష్ బాబు సినిమాల్లో శ్రీను వైట్ల తెరకెక్కించిన 'దూకుడు' సినిమా గుర్తుందా? ఆ సినిమాతో మహేష్ బాబు టాప్ హీరోగా మారిపోయాడు. అయితే ఆ సినిమాలో అన్నిటికన్నా హైలెట్ ఏమిటంటే బ్రహ్మానందంతో మహేష్ బాబు అండ్ టీమ్ ఆడించే రియాలిటీ షో. ఆ షోలో బ్రహ్మి నటన ఆద్యంతం అద్భుతం. 'దూకుడు' సినిమా విజయంలో ఆ రియాలిటీ షో ఎపిసోడ్ కీలక పాత్ర పోషించింది. అయితే అప్పట్లో ఆ సినిమా విజయానికి దోహదపడ్డ ఆ రియాలిటీ షో మళ్ళీ మహేష్ 'స్పైడర్' లో కూడా ఉండబోతుందనే న్యూస్ సాంఘీక మాధ్యమాలలో వైరల్ అయ్యింది.
అయితే 'స్పైడర్' లో దర్శకుడు మురుగదాస్ ఈ రియాలిటీ షోని చిన్న బిట్ గా మాత్రమే పెట్టాడని... ఆ రియాలిటీ షో కూడా ఓ పర్పస్ఫుల్ గా వుంటుందని తెలుస్తోంది. 'స్పైడర్' లో ఒక కీలక సన్నివేశంలో విలన్ సూర్య ను పట్టుకోవడం కోసం హీరో మహేష్ ఇలా ఒక చిన్న రియాల్టీ షో ను ప్లే చేసే ప్రయత్నం చేస్తాడనే టాక్ వినబడుతుంది. మహేష్ ఇంటిలిజెన్ ఆఫీసర్ గా కనబడనున్న ఈ సినిమాలో విలన్ కోసం రియాలిటీ షో వల వేస్తాడట హీరో. ఇక రియాలిటీ షోస్ పట్ల గృహిణులకు వున్న ఆసక్తిని వాడుకుని... ఆ మహిళల ద్వారానే పరిశోధన చేయించి.... విలన్ ఎక్కడున్నాడో కనిపెట్టే ప్లాన్ హీరో వేస్తాడట.
అయితే ఈ సినిమాలో ఈ రియాలిటీ షో హాస్యాస్పదంగా ఉండదని.... అంతా సీరియస్ గానే సాగుతుందని..... ఇక ఈ షో బిట్ మాత్రం 'స్పైడర్' లో చాలా బాగా వచ్చిందని అంటున్నారు . మరి ఇప్పుడు అన్ని భాషల్లోనూ ఈ రియాలిటీ షోస్ మీద విపరీతమైన ఆసక్తిని కనబరుస్తున్నారు ప్రేక్షకులు. అంటే మురుగదాస్ ప్రేక్షకుల నాడిని కనిపెట్టే 'స్పైడర్' లో ఈరకమైన రియాలిటీ షోని ప్లాన్ చేసాడంటున్నారు. ఇకపోతే రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం ఈ నెల 27 న దసరా కానుకగా విడుదల కాబోతుంది.