స్నేహితులిద్దరూ శత్రువులవుతున్నారు

Update: 2017-11-05 08:15 GMT

సినిమా ఇండస్ట్రీలో నారా రోహిత్ - శ్రీ విష్ణు మంచి స్నేహితులనే విషయం అందరికి తెలిసిందే. ఇప్పుడు ఈ మిత్రులిద్దరూ శత్రువులుగా మారబోతున్నారు. ఎలా అంటే నారా రోహిత్ తాజా చిత్రం బాలకృష్ణుడు, శ్రీవిష్ణు మెంటల్ మదిలో రెండు చిత్రాలు ఈనెల 24 న ఒకేసారి బరిలోకి దిగబోతున్నాయి. ఈ విధంగా వీరిద్దరూ బాక్సాఫీసు బరిలో ఢీ కొట్టబోతున్నారన్నమాట. నారా రోహిత్ నుండి డిఫరెంట్ డిఫరెంట్ సినిమాలు వస్తుంటాయి. రోహిత్ సినిమాలు విడుదలవుతున్నాయి అంటే ప్రేక్షకుల్లో కాస్త ఆసక్తి ఏర్పడిపోతుంది. ఇప్పుడు పవన్ మల్లెల దర్శకుడిగా పరిచయం చేస్తూ బాలకృష్ణుడు సినిమా చేసాడు.

ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాలో రెజినా హీరోయిన్ గా నటించింది. ఇక అప్పట్లో ఒకడుండేవాడు, తాజాగా ఉన్నది ఒకటే జిందగీ సినిమాల్తో మంచి పేరు తెచ్చుకున్న శ్రీ విష్ణు కూడా రాజ్ కందుకూరి నిర్మాణ సారధ్యంలో వివేక్ ఆత్రేయ దర్శకుడిగా పరిచయం అవుతున్న మెంటల్ మదిలో సినిమాలో నటించాడు. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ అందరిలో మంచి అంచనాలు ఏర్పడేలా చేసింది. మరి ఈ ఇద్దరు మిత్రులు ఈనెల 24 న ఒకేసారి బాక్సాఫీసు వద్ద ఢీ కొట్టేసుకుని శత్రువుల్లా మారిపోతున్నారు. మరి ఈ ఇద్దరు మిత్రుల్లో ఎవరు పై చెయ్యి సాధిస్తారో ప్రేక్షకులే డిసైడ్ చేస్తారు.

Similar News