భారతీయ చలన చిత్ర దర్శకులలో మేటి దర్శకుల జాబితా అంటూ వడపోస్తే కచ్చితంగా ఆ జాబితాలో చోటు దక్కించుకోగల ప్రతిభావంతుడు సంజయ్ లీల భన్సాలీ. రచన, సంగీతం, కూర్పు, నిర్మాణం, దర్శకత్వం వంటి పలు విభాగాలపై పట్టు వున్న ఈ నిపుణుడి నుంచి బాజీరావు మస్తానీ తరువాత వచ్చే కళాఖండం ఏదై ఉంటుందా అని సినిమా ప్రేక్షకులు నిరీక్షిస్తుండగా పద్మావతి అంటూ మరో భారీ చారిత్రాత్మక చిత్రాన్ని అనౌన్స్ చేస్తూనే భారీగా అంచనాలని పెంచేశారు సంజయ్ లీల భన్సాలీ. ఇప్పటికే చరిత్రని వక్రీకరించి చిత్ర కథ తయారు చేశారనే (అప)నింద మోస్తూ చిత్ర విడుదలకి అనేక కష్టాలని ఎదుర్కొంటున్న భన్సాలీ కి గడ్డు పరిస్థితులు ఇంకా వెంటాడుతూనే వున్నాయి.
ఈనెల 25న....
అతి కష్టం మీద సెన్సార్ దశకి చిత్రం చేరుకోగా సెన్సార్ సభ్యులు సినిమా టైటిల్ మొదలుకొని చిత్ర సన్నివేశాలలో మొత్తం 26 కట్స్ సూచించి చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ అందించగా సెన్సార్ బృందం నిర్ణయాన్ని గౌరవిస్తూ భన్సాలీ తగిన మార్పులతో చిత్ర విడుదలని ఈ నెల 25 కి ప్లాన్ చేస్తున్నారు. అన్ని సర్దుమణిగాయని అనుకుంటున్న తరుణంలో రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం ఈ చిత్ర నిషేధం పై పట్టు వీడకపోవటం, ఇప్పుడు గోవా మరియు గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నిషేధానికి సిద్ధం కావటంతో మూడు రాష్ట్రాలలో పద్మవత్ విడుదల సందేహంగా మారింది. మరో 12 రోజుల వ్యవధి ఉండటంతో విడుదల తేదీ నాటకీ ఇంకెన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పద్మవత్ చిత్ర విడుదలపై కఠిన నిర్ణయాన్ని తీసుకుంటాయోనన్న భయం సినిమా అభిమానులని వెంటాడుతోంది.