కన్నడలో ఘన విజయాన్ని సాధించిన ‘యూ-టర్న్’ చిత్రం తెలుగు రీమేక్ లో సమంత నటిస్తుందన్న విషయం తెలిసిందే. ఈ చిత్రం తెలుగులోనే కాకుండా.. తమిళంలో కూడా తెరకెక్కబోతుందట… ఈ విషయాన్ని ఆ చిత్ర దర్శకుడు పవన్ కుమార్ తెలిపాడు. తెలుగు, తమిళంలో ఏకధాటిగా చిత్రీకరణ జరుపుకొని ఈ చిత్రం రెండు భాషల్లో విడుదల కానుందట.
తెలుగు , తమిళ చిత్ర పరిశ్రమల్లో సమంతకు మంచి గుర్తింపు ఉంది. అందులో భాగంగానే ఈ చిత్రాన్ని రెండు భాషల్లో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది. మాతృక భాషలో ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన పవన్ కుమార్ తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. మరో కొత్త దర్శకుడు ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. ఈ చిత్రం చిత్రీకరణ జనవరి నెల నుండి మొదలు కానుందని నిర్మాత తెలిపారు.
2016 మే నెలలో విడుదలైన ఈ చిత్రం కన్నడలో మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రం కథ కూడా ఆసక్తికరంగా ఉండడంతో ప్రేక్షకులకు ఈ చిత్రం విపరీతంగా నచ్చేసిందనే చెప్పాలి. శ్రద్ధ శ్రీనాథ్ ఈ చిత్రంలో ముఖ్య పాత్రలో నటించింది.