ఒకపక్క తమిళ రాజకీయాలు రసవత్తరంగా సాగుతూనే ఉన్నాయి. పళని స్వామి, పన్నీర్ సెల్వం చెయ్యి కలిపి శశికళను, దినకరన్ బ్యాచ్ కి షాక్ ఇచ్చారు. మరోపక్క శశికళ జైలుకెళ్ళినప్పటినుండి కొంతమంది శశికళ డబ్బుకి లోబడి రాచమర్యాదలు చేస్తున్నారనే టాక్ ఉంది. కేవలం అది టాక్ మాత్రమే కాదు నిజమంటుంది జైళ్ల శాఖ మాజీ డీఐజీ రూప. తనదగ్గర తగిన ఆధారాలున్నాయని... బహిరంగంగావెల్లడించి ఓ నివేదిక కూడా రూపొందించి సంచలనం అయ్యారు. అయితే గతంలో కూడా స్టాంప్ కుంభకోణంలో అబ్దుల్ కరీం తెల్గి విషయంలో కూడా రూప ఇలా సంఖ్యలతో సహా ఆధారాలు బయటపెట్టి హైలెట్ అయ్యింది. కానీ ఇప్పుడు శశికళ విషయంలోనే రూప బాగా ఫోకస్ అయ్యారు. అయితే ఇక్కడ అధికారులు రూప మీద కత్తికట్టి ట్రాఫిక్.. రోడ్ సేఫ్టీ ఇన్ ఛార్జ్ గా బదిలీ చేశారు.
అయితే ఇప్పుడు ఈ ఉదంతాన్ని సినిమా చేస్తానని కన్నడ ఫిలిం మేకర్ ఏఎంఆర్ రమేష్ బయలుదేరారు. సినిమా ఇండస్ట్రీలో రమేష్ కి ఈ తరహా చిత్రాలను తెరకెక్కించడంలో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. సెన్సిటివ్ అంశాలను సినిమాలుగా మలచడంలో ఈయన చూపించే ప్రతిభకు అందరూ ముగ్ధులవుతారు. అలంటి రమేష్ ఇప్పుడు శశికళ - రూప ల జైల్ వార్ ని తెరకెక్కించబోతున్నాడు. ప్రస్తుతం అన్ని ఆధారాలను సేకరిస్తున్నానని చెప్పిన దర్శకుడు రమేష్.. స్క్రిప్ట్ రైటింగ్ కంటే ముందే అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటానని చెబుతున్నాడు.
అయితే ఈ సినిమాలో సెన్సేషనల్ ఆఫీసర్ రూప కేరెక్టర్ కి గాను ఎవరిని సెలెక్ట్ చేస్తారనే దాని మీద తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే దేవసేనగా జాతీయ స్థాయిలో విపరీతమైన గుర్తింపు సంపాదించిన అనుష్క ని గాని... లేకుంటే లేడి ఓరియెంటెడ్ మూవీస్ కి కేరాఫ్ అడ్రెస్స్ నయనతారని గాని ఈ రోల్ కు తీసుకునే యోచన ఉందని దర్శకుడు అంటున్నాడు. కాకపోతే ముందు స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేశాకే నటీనటుల ఎంపిక మొదలెడతానంటున్నాడు..