రాజమౌళి దర్శకుడిగా రామ్ చరణ్, ఎన్టీఆర్ సినిమా ఇంకా మొదలవ్వకపోయినా... అసలు వారెవరు ఈ మల్టీస్టారర్ సినిమాపై పెదవి విప్పకపోయినా ఆ సినిమా గురించిన న్యూస్ సోషల్ మీడియాలో రకరకాలు గా ప్రచారం జరుగుతుంది. ఈ సినిమా ని ఇంకా అటు ఎన్టీఆర్, ఇటు రాజమౌళి, రామ్ చరణ్ లు కన్ఫర్మ్ చెయ్యనేలేదుగాని.. ఈ సినిమా కన్ఫర్మ్ అని మెగా హీరో సాయి ధరమ్ తేజ్ జవాన్ ఇంటర్వ్యూలో సస్పెన్సు కి తెర తీసాడు. ఇక మెగా హీరో సాయి అలా కన్ఫర్మ్ చేసాడో లేదో.. ఇలా ఆ సినిమా కథ గురించిన కథనాలు మొదలయ్యాయి.
మొన్నటికిమొన్న విజయేంద్ర ప్రసాద్ బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ ల మీద రాసిన కథను రాజమౌళి... చరణ్ కోసం, ఎన్టీఆర్ కోసం వాడేస్తున్నాడన్నారు. అయితే ఇప్పుడు ఈ మల్టి స్టారర్ సినిమా క్రీడా నేపథ్యంలో ఉండబోతోందనే ప్రచారం షురూ అయ్యింది. అలాగే క్రీడా నేపథ్యంలో ఉన్న ఈ సినిమా లో చరణ్, ఎన్టీఆర్ లు బాక్సర్లుగా తలపడతారని అంటున్నారు. మరి బాక్సర్లు అంటే.. దానికి తగ్గ శరీరాకృతి ఉండాలిగా. .. అందుకే ఇప్పుడు చరణ్, ఎన్టీఆర్ లు ఇద్దరూ శరీరాన్ని పెంచుకునేందుకు ఇప్పటికే ప్రత్యేక వ్యాయామాలు చేస్తున్నారని కూడా టాలీవుడ్ వర్గాలు చెబుతున్న మాట.
ఇకపోతే డీవీవీ ఎంటర్ టైయిన్ మెంట్స్ పతాకంపై దానయ్య నిర్మిస్తారని చెబుతున్న ఈ మల్టీస్టారర్ సినిమా రాజమౌళి దర్శకత్వంలో ఫిబ్రవరి నుండి సెట్స్ మీదకెళుతుందని అంటున్నారు.