వామ్మో ఇంత సాహసం ఎందుకు చేశారో..?

Update: 2017-08-11 03:34 GMT

శంకర్ - రజినీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న '2.0' చిత్రం షూటింగ్ అయితే కంప్లీట్ అయ్యింది గాని... పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కి మాత్రం మరో 5 నెలల సమయం పట్టడంతో ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరిలో విడుదల చేస్తామని మేకర్స్ చెబుతున్నారు. సౌత్ ఇండస్ట్రీలోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే వున్నాయి. ఈ అంచనాల తోనే ' 2.0' నిర్మాతలైన లైకా ప్రొడక్షన్ వారు '2.0 ' తో మంచి క్యాష్ చేసుకోవాలనే ప్లాన్ తో ఉన్నారు. ఆ ప్లాన్ లో భాగంగానే '2.0 'తెలుగు ఫస్ట్ కాపీని 75 కోట్ల కు అమ్మేసినట్లు తెలుస్తుంది. దీనితో రోబో 2 తెలుగు వెర్షన్ డీల్ పూర్తయినట్లే అని చెబుతున్నారు.

ఒక తమిళ డబ్బింగ్ సినిమా తెలుగులో ఇంత రేటు పెట్టి కొన్నారు అంటే ఆ సినిమాపై ఎంత నమ్మకం ఉండాలి. అలాగే శంకర్ - రజినీకాంత్ కాంబినేషన్ మీద ఎంత నమ్మకముండాలి ?. అటు డైరెక్టర్ శంకర్ కి గాని ఇటు రజినీకి గాని ప్రస్తుతానికి హిట్స్ లేకుండా ప్లాపులతో ఉన్నారు. శంకర్ 'ఐ' సినిమా ఘోరాతి ఘోరమైన ప్లాపయింది. అలాగే రజిని నటించిన వరుస చిత్రాలు ప్లాపుల లిస్టులోనే ఉన్నాయి. అయినా కూడా '2.0' మీద ఉన్న అంచనాలు ఏ మాత్రం తగ్గలేదని తెలుగు కి వచ్చిన రేటును చూస్తుంటే అర్ధమవుతుంది. ఇకపోతే తెలుగు లో '2.0' ని కొన్నది మాత్రం ఏసియన్ సునీల్. మరి సినిమాల విషయంలో ఎటువంటి రిస్క్ తీసుకొని ఏసియన్ సునీల్ వారు ఇలా '2.0' కోసం ఇంత భారీ రేటుని పెట్టారంటే ఇక్కడ షాకింగ్ విషయంగా కనబడుతుంది.

ఎందుకంటే ఏసియన్ సునీల్ వారు 'బాహుబలి' విషయంలోనే రిస్క్ తీసుకోకుండా సేఫ్ గేమ్ ఆడారు. నైజాంకు 'బాహుబలి' 45 కోట్ల బేరసారాలు జరుగుతూ 50 అనగానే రిస్క్ ఎందుకులే అని..... కమిషన్ మీద పంపిణీ చేసారు తప్ప కొనుగొలు చేయలేదని ఇండస్ట్రీ టాక్. మరి ఇలాంటి వారు '2.0 ' కోసం 75 కోట్లకు పోటీ పడి మరి కొన్నారంటేనే నమ్మబుద్ది కావడంలేదు. ఇకపోతే ఏసియన్ సునీల్ మాత్రమే కాకుండా '2.0' హక్కుల కోసం పోటీ పడిన వారిలో బెల్లంకొండ సురేష్, మిరియాల రవీందర్ రెడ్డి లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఏసియన్ సునీల్ అంటే అతనితో పాటు దగ్గుబాటి సురేష్, అలంకార్ ప్రసాద్ లాంటి పెద్దలు సహకారం ఉంటుంది కాబట్టి సినిమాకి ఏ రిస్క్ లేకుండా ఉంటుందనే ఉద్దేశ్యంతోనే '2.0 ' మేకర్స్ తెలుగు హక్కుల్ని ఏసియన్ సునీల్ కు అందించినట్లు తెలుస్తోంది. మరి ఒక్క తెలుగులోనే ఈరకమైన బిజినెస్ జరిగింది అంటే ప్రపంచ వ్యాప్తంగా '2.0' బిజినెస్ ఇంకే రేంజ్ కి వెళుతుందో.. ఎన్ని రికార్డులు నెలకొల్పుతుందో అంటున్నారు.

Similar News