వర్మ తప్పించుకున్నాడు

Update: 2018-02-23 08:14 GMT

జీ ఎస్ టీ సినిమా వివాదం నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మపై పలు పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల విషయంలో సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసి గతవారం వర్మను సీసీఎస్ క్రైం బ్రాంచ్ కు పిలిపించి విచారించిన విషయం తెలిసిందే. గతవారం వర్మను విచారించిన సీసీఎస్ పోలీసులు వర్మకు సంబందించిన లాప్ టాప్ ను సీజ్ చేశారు. అయితే పోలీసులు మళ్ళీ ఈ రోజు సీసీఎస్ పోలీసుల ముందు విచారణకు హాజరుకావాలని ఆ రోజు వర్మకి చెప్పారు.

అయితే మొదటి దశ విచారణ తరువాత వర్మ ల్యాప్ టాప్ ను పోలీసులు స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. వర్మ కు సంబందించిన ల్యాప్ టాప్ సీజ్ చేసిన నివేదిక ఫోరెన్సిక్ ల్యాబ్ నుండి ఇంకా పోలీసులకు అందలేదని.... కావున ఈరోజు విచారణకు హాజరు కావలసిన అవసరం లేదని వర్మకు సమాచారం అందించారు పోలీసులు. దీంతో ఈ రోజు శుక్రవారం విచారణ నుండి వర్మ తప్పించుకుని ఊపిరి తీసుకున్నాడు. అయితే ఇది వర్మ ముందే ఊహించాడేమో... నిన్న గురువారమే తాను రేపు శుక్రవారం విచారణకు హాజరవడం లేదని ట్వీట్ చేసాడు.

అయితే మరోవైపు రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేయాలనీ మహిళా సంఘాలు పెద్దఎత్తున రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. వర్మ మీద పోలీస్ లు పలు సెక్షన్స్ కింద కేసులు నమోదు చేస్తున్నారు. మరి వర్మ విచారణ మార్చి మొదటి వారానికి వాయిదా పడింది. దీనిపై మహిళాసంఘాలు ఎలా రియాక్ట్ అవుతాయో అనేది తెలియాల్సి ఉంది.

Similar News