తొలిప్రేమ తో అదిరిపోయే హిట్ అందుకున్న వరుణ్ తేజ్ తన తదుపరి చిత్రాన్ని ఘాజి డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ఒక స్పేస్ మూవీ ని చెయ్యబోతున్నాడు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ వ్యోమగామిలా కనిపిస్తాడని ప్రచారం షురూ అవడమే కాదు... సంకల్ప్ రెడ్డి - వరుణ్ తేజ్ సినిమా టైటిల్ కూడా అహం బ్రహ్మాస్మి అంటూ టాలీవుడ్ ఫిలింసర్కిల్స్ లో ఒక న్యూస్ గత ఐదారు రోజులుగా హల్చల్ చేస్తుంది. మరి స్పేస్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాకి ఇలాంటి అంటే అహం బ్రహ్మాస్మి.. లాంటి కూల్ టైటిల్ ఏమిటా అని అందరిలో ఒకింత ఆశ్చర్యం కలిగింది.
వ్యోమగామిగా వరుణ్ తేజ్ ఈ అహం బ్రహ్మాస్మి టైటిల్ తో ఎలా కనిపించనున్నాడో అనే క్యూరియాసిటీ కూడా అందరిలో కలిగింది. అయితే ఇప్పుడు తాజాగా ఈ అహం బ్రహ్మాస్మి టైటిల్ వరుణ్ తేజ్ - సంకల్ప్ రెడ్డి కలయికలో తెరకెక్కబోయే సినిమాకి కాదని తెలుస్తుంది. ఇదే టైటిల్ మరో టాప్ డైరెక్టర్ తన సినిమా కోసం తీసుకున్నాడు. ప్రస్తుతం బాలీవుడ్ లో మణికర్ణికా వంటి చరిత్రకాత్మక సినిమాని తెరకెక్కిస్తూ బిజీగా వున్న టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ క్రిష్ తనతదుపరి తెలుగు సినిమా కోసం ఈ అహం బ్రహ్మాస్మి టైటిల్ ని తీసుకున్నాడట. అయితే ఈ టైటిల్ తో క్రిష్ ఒక స్టార్ హీరోతో ని తెరకెక్కిస్తున్నట్లుగా తెలుస్తుంది. బాలీవుడ్ లో కంగనా మెయిన్ లీడ్ లో మణికర్ణికా చిత్రం పూర్తి కాగానే క్రిష్ తెలుగులో ఒక స్టార్ హీరోతో ఈ అహం బ్రహ్మాస్మి టైటిల్ తో సెట్స్ మీదకెళతాడట.
మరి ఈ స్మూత్ టైటిల్ తో వరుణ్ తేజ్ వస్తాడనుకుంటే... ఇప్పుడు ఆ టైటిల్ తో ఒక స్టార్ హీరో రాబోతున్నాడన్నమాట. మరి ఒక టైటిల్ ఇలా అందరిని కన్ఫ్యూజ్ చెయ్యడం మాత్రం నవ్వు తెప్పిస్తుంది. ఇంతకీ అందరూ ఈ టైటిల్ విషయంలో అంతలా కన్ఫ్యూజ్ అవడానికి కారణం ఏమిటో తెలుసా... అదేనండి డైరెక్టర్ క్రిష్ ఫ్యామిలీ బేనర్లో రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు లు గతంలో కంచె, గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలు నిర్మించారు. అయితే ఇప్పుడు వరుణ్ - సంకల్ప్ సినిమాను, అలాగే క్రిష్ తదుపరి తెలుగు చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయబోయేది వారే కావడం.... తమ బ్యానర్ లో అహం బ్రహ్మాస్మి అనే టైటిల్‌ను రిజిస్టర్ చేసేసరికి... అందరు ఈ టైటిల్ వరుణ్ సినిమాకే అన్న ప్రచారం జరిగింది. ఐతే ఇప్పుడు ఈ టైటిల్ విషయంలో పూర్తి స్పష్టత వచ్చింది.