చిత్ర పరిశ్రమలో కెరీర్ ప్రారంభించి 15 సంవత్సరాలు పూర్తి కావస్తున్నా కూడా అవకాశాల కొదవ లేకుండా నిరంతరం చిత్రీకరణలతో బిజీగా ఉంటున్న అందాల భామ నయనతార గడిచిన ఏడాది 2017 లో తన ప్రతిభకి తగిన ఫలితాలను ఆస్వాదించగలిగింది. ఈ ఏడాది సంక్రాంతి పండుగకి బాక్స్ ఆఫీస్ వద్ద తలపడనున్న పెద్ద చిత్రాలలో నయనతార ప్రధాన కథానాయికగా నటించిన 'జైసింహ' చిత్రం కూడా ఉండటంతో నూతన సంవత్సరాన్ని కూడా ఘనంగా ప్రారంభించబోతోంది నయన్. కాగా మీడియాతో, ప్రేక్షకులతో అంతంత మాత్రపు సంబంధాలని సాగిస్తూ వస్తున్న నయనతార ఈ నూతన సంవత్సర వేడుక నాడు ఒక బహిరంగ లేఖ తో చిత్ర ప్రేక్షకులకి, మీడియా వారికి తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపి అందరిని ఆశ్చర్య పరిచింది.
2017 లో విడుదలై విజయం సాధించిన నయన్ నటించిన చిత్రాలలో తనకి 'అరబ్' అనే తమిళ చిత్రం చాలా ప్రత్యేకమైనది అని పేర్కొన్న నయన్ రానున్న కాలంలో కూడా వినోదాత్మక చిత్రాలతో పాటు ఇలాంటి ఉపయోగకార చిత్రాలలో విభిన్న పాత్రలు పోషించాలనుకుంటున్నట్టు తన మనసులో మాట బైట పెట్టింది. గడిచిన ఏడాది లో తనకి అనూహ్యమైన విజయాలు దక్కటానికి సహకరించిన ప్రేక్షకులకి, ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా వారికి ప్రత్యేక కృతజ్ఞతలతో పాటు హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపింది నయనతార.
2017 లానే 2018 లోనూ నయన్ తన నటనతో ప్రేక్షకులకి మరింత చేరువవుతుందని ఆశిద్దాం.