కన్నడ లో 2016 లో విడుదలై అద్భుత విజయం సాధించిన థ్రిల్లర్ చిత్రం 'యూ టర్న్' పై అప్పట్లో రీమేక్ యోచనతో చాలా మంది దర్శక నిర్మాతలు కన్నేశారు. అయితే గత ఏడాదే ఈ రీమేక్ ప్రాజెక్ట్ లో సమంత లీడ్ రోల్ చేస్తుందనే వార్త అధికారికంగా బైటకి వచ్చినప్పటికీ ఎప్పటికి మొదలవుతుందో క్లారిటీ లేదు. ప్రస్తుతం మోస్ట్ ఇంటెలిజెంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ సరసన రంగస్థలం తో పాటు వైజయంతి మూవీస్ వారి సావిత్రి గారి బయోపిక్ మహానటి లో కీలక పాత్ర పోషిస్తూ ఈ ఏడాది రాబోతున్న రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ లతో అలరించబోతున్న సమంత, ఇప్పుడు ఈ యూ టర్న్ రీమేక్ కి కాల్ షీట్స్ సర్దుబాటు చేసేసింది.
తెలుగు మరియు తమిళ భాషలలో ఏకసమయంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి సమంత రెండు భాషలలో ప్రధాన పాత్ర తానే పోషించనుంది. కన్నడ లో యూ టర్న్ తెరకెక్కించిన దర్శకుడు పవన్ తెలుగు, తమిళ భాషలలో కూడా దర్శకత్వ బాధ్యతలు చేపట్టనున్నారు. ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ చిత్రం పూర్తయ్యే లోపే రంగస్థలం మరియు మహానటి ల విడుదలలు ఉండటంతో ఈ చిత్రం బిజినెస్ చేసుకునే సమయానికి సమంత క్రేజ్ బాగా హెల్ప్ అయ్యే అవకాశాలు వున్నాయి.