మహేష్ సినిమా టైటిల్ అదా?

Update: 2017-10-24 04:59 GMT

మహేష్ బాబు 'స్పైడర్' చిత్ర ఫలితం నుండి పూర్తిగా బయటపడ్డాడు. తన మేనకోడలు.... మంజుల కూతురు ఓణీల వేడుకలో హుషారుగా పాల్గొన్న మహేష్ బాబు ఇప్పుడు కొరటాల దర్శకత్వంలో ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న 'భరత్ అనే నేను' సినిమా సెట్స్ మీదకెళతాడనే టాక్ ఉంది. 'శ్రీమంతుడు' వంటి భారీ హిట్టిచ్చిన కొరటాల శివ - మహేష్ బాబు ల ఈ రిపీట్ కాంబినేషన్ మీద భారీ అంచనాలే ఉన్నాయి. మహేష్.. కొరటాల మూవీతో పాటే మరో మూవీని లైన్ లో పెట్టాడు. వంశి పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు - అశ్విని దత్ నిర్మాణంలో ఒక సినిమాని ఎప్పుడో మొదలు పెట్టేసాడు.

ఇప్పటికే నిర్మాత దిల్ రాజు, దర్శకుడు వంశీ పైడిపల్లి, మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీప్రసాద్ లు కలిసి అమెరికాలో సిట్టింగ్ వేసి.... ట్యూన్ లు రెడీ చేయడం ప్రారంభించారు. అంతేకాకుండా వంశి - మహేష్ సినిమా స్క్రిప్ట్ కూడా రెడీగా ఉందట.మరి స్క్రిప్ట్ కూడా రెడీ అంటే ఆ సినిమా టైటిల్ కూడా ఏదో ఒకటి నానుడిలోకొచ్చేస్తుంది. అలా మహేష్ - వంశి పైడిపల్లి సినిమాకి ‘కృష్ణా ముకుందా మురారి’ , ‘హరేరామ హరే కృష్ణ’ అనే రెండు టైటిల్స్ ని చిత్ర బృందం పరిశీలిస్తున్నట్టుగా ప్రచారం మొదలైపోయింది. ఈ రెండు టైటిల్ లో ఏదో ఒకటి మహేష్ సినిమాకి ఫైనల్ అంటున్నారు కూడా.

అసలు సినిమా మొదలెట్టకముందే ఇలాంటి టైటిల్స్ బోలెడన్ని ప్రచారంలోకొచ్చేస్తాయి. అయితే కొన్ని సినిమాలకు ఆ టైటిల్స్ లో ఏదో ఒకటి పెట్టేసే చిత్ర బృందం... ఒక్కోసారి ప్రచారంలో ఉన్న టైటిల్ కి సంబంధం లేకుండా కొత్త టైటిల్స్ బయటికి వచ్చేస్తాయి. సో.. మహేష్ - వంశి పైడిపల్లి సినిమా టైటిల్ అధికారిక ప్రకటన వచ్చేవరకు ఎటువంటి టైటిల్ ని సెట్ చెయ్యలేమంటున్నారు కొందరు.

Similar News