రజినీకాంత్ - శంకర్ కలయికలో తెరకెక్కిన రోబో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. మళ్ళీ అదే కాంబోలో ఇప్పుడు 2 .0 సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా మొదలైనప్పటినుండి ఈ కాంబో మీద భారీ అంచనాలున్నాయి. శంకర్ 2.0 సినిమాని సరికొత్త టెక్నాలజీతో త్రీడీలోనూ చిత్రీకరణ జరిపిస్తున్నారు. దాదాపు మూడేళ్ళుగా కష్టపడుతున్న ఈ సినిమా ఈపాటికే విడుదలవ్వాల్సి ఉండగా... గ్రాఫిక్ వర్క్స్ కారణంగా విడుదల లేట్ అవుతూ వచ్చింది. ఇప్పటికే విడుదల చేసిన 2.0 సినిమా మేకింగ్ వీడియో లో గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ కోసం ఎంతగా శ్రమిస్తున్నారో పూర్తిగా అర్ధమయ్యింది.
కానీ సినిమా ఇలా వాయిదాల మీద వాయిదాలు పడుతూ సినిమా మీదున్న అంచనాలు తగ్గించేస్తుందా అనే అనుమానం అందరిలో మొదలయ్యింది. గ్రాఫిక్ వర్క్ పనులు సగానికి పైగా పూర్తయ్యాక ఆ పనులు అప్పజెప్పిన కంపెనీ దివాళా తియ్యడంతో మళ్ళీ 2.0 గ్రాఫిక్స్ పనులు మొదటికి రావడంతోనే సినిమా విడుదలకు ఇంకా ఆలస్యమైంది. ఇకపోతే 2.0 లో వీఎఫెక్స్ కళ్లు చెదిరే రీతిలో ఉంటాయని మేకింగ్ వీడియోలో స్పషమైన సంగతి తెలిసిందే. మరి అంత అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్‌ను త్రీడీలో చూస్తే మరింత గొప్పగా అనిపిస్తాయని.. ఆలోచించిన 2.0 చిత్ర బృందం హాలీవుడ్ స్టాండర్స్ తో కొత్త టెక్నలాజితో 2.0 ని 3 డి లో చిత్రీకరణ కోసం పూనుకుంది.
అయితే ఈ 2.0 సీన్స్ మొత్తం 3 డి రూపంలోకి మలచడంలో మాత్రం ఆశించిన ఔట్ పుట్ రాలేదని ఇప్పుడు తాజాగా అందుతున్న వార్త. ఈ 3 డి ఎఫెక్ట్స్ ని హాలీవుడ్ స్టూడియోకు అప్పగించగా.. వాళ్లు సరైన ఔట్ పుట్ ఇవ్వలేదట. ఇప్పటికే గ్రాఫిక్ వర్క్స్ విషయంలో జరిగిన ఆలస్యం కారణంగా సినిమా విడుదల పోస్ట్ పోన్ మీద పోస్ట్ పోన్ అయ్యి సినిమా మీద ఉన్న క్యూరియాసిటీ తగ్గిపోతుంటే... ఇప్పుడు 3 డి ఎఫెక్టుల విషయంలోనూ ఇలాగే జరిగేసరికి 2.0 టీమ్ కి టెన్షన్ స్టార్ట్ అయ్యిందట. మరి ఇప్పుడు ఈ 3 డి కోసం సినిమాని ఇంకా వాయిదా వేస్తె సినిమాపై ఉన్న కాస్త ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోతుందని భావించిన శంకర్ 2.0 3 డి లేకుండానే విడుదల చెయ్యడానికి సిద్ధమయ్యాడని అంటున్నారు. మరి 2.0 ని 3 డి లో చూద్దామనుకునే 3 డి ప్రియులకు ఇది షాకింగ్ న్యూసే.