విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాగార్జున నిర్మాణంలో అఖిల్ నటిస్తున్న హలో సినిమా విడుదలకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటుంది. ఈ నెల 22 న థియేటర్స్ లోకి రానున్న హలో సినిమా ప్రమోషన్స్ లో అటు అఖిల్ ఇటు నాగార్జున కూడా బిజీగా గడిపేస్తున్నారు. ప్రస్తుతానికి అమెరికా లో హలో ప్రచార కార్యక్రమాలు చేపడుతున్న అఖిల్.. హైదరాబాద్ కి రాగానే అంటే ఈ నెల 20 న హైదరాబాద్ లో హలో ప్రీ రిలీజ్ ఈవెంట్ చెయ్యడానికి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఈ సినిమాతో అఖిల్ కేవలం హిట్ కొట్టడమే కాదు... 40 కోట్ల క్లబ్బులో చేరాలనే తాపత్రయంతో కనబడుతున్నాడు.
25 నుండి 30 కోట్ల మధ్య పెట్టుబడి పెట్టిన ఈ సినిమా ని నాగార్జున కూడా భారీగానే విడుదల చేస్తున్నాడు. ఇప్పటికే హలో సినిమా థియేట్రికల్ రైట్స్ కి 32 కోట్లు రాగా... శాటిలైట్ హక్కులు, డిజిటల్ హక్కుల ద్వారా మరికొంత సొమ్ము వచ్చింది. అఖిల్ మొదటి సినిమా డిజాస్టర్ అయినప్పటికీ ... ఇప్పుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకే సినిమా విడుదలైన మొదటి వారానికే మంచి కలెక్షన్స్ కొల్లగొట్టేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
మరి సినిమా విడుదలై పాజిటివ్ టాక్ వస్తే ఇంత మొత్తం కొల్లగొట్టడం అంత కష్టమైన పని కాదు గాని.. టాక్ లో తేడా వస్తేనే కలెక్షన్స్ కొల్లగొట్టడం అనేది కష్టమైన పని. మరి ప్రస్తుతానికి టీజర్, ట్రైలర్ చూస్తే సినిమాలో ఏదో విషయమున్నట్టుగానే కనబడుతుంది. చూద్దాం మరొక్క వారంలో హలో అసలు విషయం బయటపడుతుంది. ఇకపోతే ఈ సినిమాలో అఖిల్ కి జోడిగా కళ్యాణి నటిస్తుండగా అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు.