2018 కొత్త సంవత్సరం రోజున మంచు విష్ణు దంపతులు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. మరి మంచు కుంటుంబంలో పుట్టిన మొట్టమొదటి మగ బిడ్డ కావడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మంచు మోహన్ బాబు అయితే ఎంతో సంతోషంతో ఉన్నారో మాటల్లో చెప్పలేనిది. బాబు పుట్టింది మొదలు మోహన్ బాబు ఫ్యామిలిలో ప్రతి రోజు పండుగ వాతావరణం కనబడుతుంది. ఇంతకుముందే మంచు విష్ణు దంపతులకు అరియానా, వివియానా అనే కవల పిల్లలు ఉన్నారన్న సంగతి తెలిసిందే.
ఇకపోతే తాజాగా విష్ణు కుమారుడికి నామకరణం చేశారు. విష్ణు కుమారుడికి తన తండ్రి మోహన్ బాబు అసలు పేరు భక్త వత్సలమ్ నాయుడు అనే పేరును కలిసొచ్చేలా పెట్టారు. ఇక ఆ బాబు పేరును 'అవ్రామ్ భక్త మంచు' అని పెట్టినట్లు మంచు మనోజ్ ట్విట్టర్ ద్వారా అభిమానులకు తెలియజేశాడు. మోహన్ బాబు అసలు పేరు భక్త వత్సలమ్ నాయుడు. ఆ పేరులోని భక్త అనే పదాన్ని విష్ణు తన కుమారుడికి ఎంతో ప్రేమతో పెట్టుకున్నాడు.
అలాగే ఈ సందర్భంగా మంచు విష్ణు తన ట్విట్టర్ లో ఒక పోస్ట్ చేసాడు. తన పిల్లలకు పెట్టిన పేర్ల అర్ధాలను స్వయంగా వివరించాడు. తన కూతుళ్ళ పేర్లకు అర్ధంతో పాటు కొత్తగా కుమారుడికి పెట్టిన పేరుకు అర్ధాన్ని కూడా మంచు విష్ణు వివరించారు. అరియానా అంటే ‘బేబీ లయన్’ అని, వివియానా అంటే ‘బేబీ టెడ్డీ బేర్’ అని అవ్రామ్ అంటే ‘ఎవరూ ఆపలేని వ్యక్తి’ అని విష్ణు ట్వీట్ చేసాడు.