అర్జున్ రెడ్డి చిత్రంతో చిత్ర పరిశ్రమ మొత్తాన్ని తన వైపుకి తిప్పుకున్నాడు పరిచయ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. ఆయన చెప్పిన అత్యంత బోల్డ్ మరియు సెన్సిబుల్ లవ్ స్టోరీ కి యావత్ పరిశ్రమతో పాటు ప్రేక్షకులు కూడా ఫిదా అయిపోయారు. ఈ చిత్రం విడుదలైన కొద్దీ రోజులకే తెలుగులో తాను సూపర్ స్టార్ మహేష్ బాబు తో సినిమా చేయనున్నట్టు ప్రకటించాడు సందీప్ రెడ్డి. ఈ చిత్రం కోసం ఇప్పటికే 70 శాతం స్క్రిప్ట్ పనులు పూర్తి చేసుకున్నాడు కానీ తాత్కాలికంగా ఈ స్క్రిప్ట్ పనులు పక్కన పెట్టాడు సందీప్.
మహేష్ కి ప్రస్తుతం సెట్స్ పై ఉన్న కొరటాల శివ సినిమాతో పాటు వరుసలో వంశి పైడిపల్లి, త్రివిక్రమ్ శ్రీనివాస్ ల చిత్రాలు ఉండటంతో సందీప్ రెడ్డి చిత్రం సెట్స్పైకి వెళ్ళటానికి చాలా సమయం వుంది. ఈ గ్యాప్ లో బాలీవుడ్ నుంచి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటూ అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కోసం చేస్తున్న కసరత్తులు కోసం మహేష్ చిత్ర స్క్రిప్ట్ పనులు హోల్డ్ లో పెట్టాడు ఈ యువ దర్శకుడు. అయితే మహేష్ తో ప్రాజెక్ట్ కి కర్త కర్మ క్రియ ఐన నమ్రత శిరోడ్కర్ అనుమతితోనే సందీప్ బాలీవుడ్ ప్రాజెక్ట్ పనులలో నిమగ్నమవుతూ మహేష్ తో చేయబోయే స్క్రిప్ట్ కి బ్రేక్ ఇచ్చాడట.