సంక్రాంతి అంటే తెలుగువారికి ప్రత్యేక పండగ. సంక్రాంతి పండగకి కొత్త బట్టలు,పిండి వంటలు, భోగి మంటలు కొత్త సినిమాలతో తెలుగు రాష్ట్రాలు కోలాహలంగా ఉంటాయి. అందుకే సంక్రాంతి సీజన్లో సినిమాను విడుదల చేస్తే కలెక్షన్స్ రాబట్టుకోవచ్చు అని అనుకుంటారు దర్శక నిర్మాతలు. ప్రతీ ఏడాది లాగే ఈ సంవత్సరం కూడా సంక్రాంతికి కొత్త సినిమాలు సందడి చేయనున్నాయి. ఈసారి సంక్రాంతి బరిలో ముగ్గురు పెద్ద హీరోలు, ఓ యువ హీరో సినిమాలు ప్రేక్షకుల్ని పలకరించబోతున్నాయి.
ఈఏడాది సంక్రాంతి సీజన్లో మొదటగా జనవరి 10న పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’గా అలరించబోతున్నాడు. ఆ తరువాత జనవరి 12న బాలకృష్ణ ‘జై సింహ’గా, సూర్య డబ్బింగ్ చిత్రం ‘గ్యాంగ్’ రాబోతున్నాయి. జనవరి 14న రాజ్ తరుణ్ నటించిన ‘రంగుల రాట్నం’ విడుదల కానుంది. ఈసారి విడుదలవుతున్న అన్ని చిత్రాలకు క్రేజ్ బాగానే ఉంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ నటించిన 'అజ్ఞాతవాసి' చిత్రం ట్రైలర్, సాంగ్స్ తో యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తుంది. ట్రైలర్ విడుదలైన కొద్దిగంటలకే వ్యూస్ లక్షల్లోకి దూసుకెళ్లాయి. ఇప్పటికీ యూట్యూబ్ లో ఈ ట్రైలర్ హవాను కొనసాగిస్తుంది.
ఇక బాలయ్య ‘జై సింహ’గా గర్జించడానికి సిద్దమవుతున్నాడు. ఈ చిత్రంపైనా భారీ అంచనాలున్నాయి. తమిళ నటుడు సూర్య తెలుగులో మొదటిసారి డబ్బింగ్ చెప్పిన చిత్రం ‘గ్యాంగ్’. ఈ చిత్రం పై కూడా ప్రేక్షకుల అంచనాలు బాగానే ఉన్నాయి. గత వారమే సర్ప్రైజింగ్ గా సంక్రాంతి రేస్ లోకి వచ్చిన రంగుల రాట్నం చిత్రం ట్రైలర్ తో ప్రేక్షకుల చూపును తమవైపు తిప్పుకుంది. మరి ఈ నాలుగు చిత్రాల్లో ఏ చిత్రం పైచెయ్యి సాధిస్తుంది... అలాగే ఏ హీరో సంక్రాతి హీరో అవుతాడని ఆసక్తి మాత్రం ప్రతి ప్రేక్షకుడిలో నెలకొని ఉంది