బాలకృష్ణ తన 101 వ చిత్రం పైసా వసూల్ ని పూరి దర్శకత్వం లో చేసి అందరికి షాకిచ్చాడు. అయితే పూరి జగన్నాధ్ కూడా పైసా వసూల్ ని ఎలాగైనా హిట్ చెయ్యాలనుకున్నాడు. కానీ ఆయన గత చిత్రాల ప్లాపుల పరంపర పైసా వసూల్ ని కూడా చుట్టుకుంది. అయితే సినిమా ప్లాపయినా బాలయ్య మాత్రం పూరికి బాగా కనెక్ట్ అయ్యాడు. పూరి మేకింగ్ స్టైల్, తనని సినిమాలో చూపించే విధానం, అలాగే డైలాగ్స్ లోని పూరి మార్క్ వంటివాటికి బాలకృష్ణ బాగా ఫిదా అయ్యాడు. ఆ ఫిదాతోనే పూరికి తను మరో చిత్రం చేస్తానంటూ ప్రకటించేశాడు. అయితే ఆ చిత్రం ఎన్టీఆర్ బయో పిక్ గా ఉంటుందనే ప్రచారం జోరుగా జరిగింది. కానీ ఆ ఎన్టీఆర్ బయో పిక్ తేజ చేతికి వెళ్ళినట్లే కనబడుతుంది.
ఒకవేళ ఆ చిత్రం తన చేతికి రాకపోయినా మరో అవకాశం బాలయ్య తనకి ఇస్తాడని ఆశతో పూరి ప్రస్తుతం తన కొడుకు హీరోగా మెహబూబా సినిమాని అధికారికంగా స్టార్ట్ చెయ్యడమే కాదు.. రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలెట్టేసాడు. ఒక పక్కన కొడుకు సినిమాని డైరెక్ట్ చేస్తూనే బాలయ్య ని వదలడంలేదు. బాలకృష్ణ తో తన కొడుకు సినిమాకి సంబందించిన ప్రతి విషయాన్నీ షేర్ చేసుకుంటూ అయన సలహాలు సూచనలు తీసుకుంటున్నాడు పూరి. మరి ఇలా బాలయ్యనే అంటిపెట్టుకుని తిరగడం, బాలయ్య సూచనల మేరకు ఆకాష్ సినిమాని డైరెక్ట్ చెయ్యడం చూస్తుంటే బాలయ్యకి పూరి బాగా బిస్కెట్స్ వేస్తున్నాడన్నమాట.
మరి ఈదెబ్బకి బాలయ్య ఒకవేళ తన సినిమాకి ఛాన్స్ ఇవ్వకపోయినా త్వరలోనే తన కొడుకు మోక్షజ్ఞ ని సినిమా ఇండస్ట్రీకి పరిచయం చెయ్యబోతున్నాడు. మరి మోక్షజ్ఞ పరిచయ కార్యక్రమాన్ని బాలయ్య తనకేమన్న అప్పగిస్తాడని ఆశించడమేకాదు... ఇప్పుడు తన కొడుకు హీరోగా తెరకెక్కుతున్న మెహబూబాని సక్సెస్ చెయ్యగలిగితే ఆటోమేటిక్ గా బాలయ్య పిలిచి అవకాశం ఇస్తాడని ఆశతో ఉన్నాడట పూరి. అందుకే అన్ని విషయాలను బాలయ్యతో చర్చించే నిర్ణయాలు తీసుకుంటున్నాడని టాక్.