సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన 'ఆర్య, ఆర్య 2 ' సినిమాలతో అల్లు అర్జున్ కి ఇండస్ట్రీలో స్టార్ హోదా వచ్చింది. ఆ దెబ్బకి సుకుమార్, అల్లు అర్జున్ ల బంధం దృఢత్వం సంతరించుకుంది. ఇప్పటికీ వారి అనుబంధం అలానే కొనసాగుతుంది. అందుకే అల్లు అర్జున్ కి సుకుమార్ అంటే ప్రత్యేకమైన అనుబంధం. మొన్నటికి మొన్న ఎవరికైనా 'ఐ లవ్ యు' చెప్పాలంటే అది ఒక్క సుకుమార్ కే చెబుతానంటూ సుకుమార్ పట్ల తన మనసులోని అనుబంధాన్ని బహిర్గతం చేసాడు. అయితే ఇప్పుడు సుకుమార్ 'దర్శకుడు' సినిమా ఇంటర్వ్యూ లో బన్నీతో తనకున్న అనుబంధం గురించి చెప్పుకొచ్చాడు.
నన్ను ఎప్పుడూ అల్లు అర్జున్ ఆటపట్టిస్తూ ఏడిపిస్తాడని చెబుతున్నాడు. ‘మట్టుపర్రోడా’ అని బన్నీ తనని ఆటపట్టిస్తుంటాడని చెబుతున్నాడు. అయితే అలా ‘మట్టుపర్రోడా’ అని అల్లు అర్జున్ ఆటపట్టించడానికి కారణం కూడా వివరించాడు. మా ఊరి పేరు 'మట్టపర్రు'. మాది చాలా మారుమూల గ్రామం అది. అక్కడికి కనీసం బస్సు సౌకర్యం కూడా లేదు. ఇప్పటికీ అక్కడికి బస్సులు వెళ్లవు. అసలు రోడ్డు ఉండదు. అలాంటి మా ఊరికి ఒకసారి బన్నీని తీసుకెళ్లా.... అయితే అక్కడ మా ఊరి పరిస్థితిని చూసిన బన్నీ నోరెళ్లబెట్టాడు.
ఎటువంటి సౌకర్యం లేని ఊరినుండి వచ్చిన నువ్వు అంత పెద్ద సినిమాలు తీస్తున్నావా? అంటూ ఆశ్చర్యపోయాడట. మరి నిజంగా పాతికేళ్ల పాటు నేను ఆ ఊర్లోనే ఉన్నా. మట్టిలో పుట్టా. మట్టిలో పెరిగా. ఆ వాసనలు, ఆ అలవాట్లు నాలో ఇంకా పోలేదు. అందుకే బన్నీ అప్పుడప్పుడు నన్ను ‘మట్టుపర్రోడా’ అని ఆటపట్టిస్తుంటాడని చెప్పుకొచ్చాడు.