స్పైడర్ సినిమాతో మహేష్ బాబు తమిళనాట గ్రాండ్ గా అడుగుపెట్టాడు. ఇప్పటివరకు తన సినిమాలను డబ్బింగ్ చేస్తూ విడుదల చేసే మహేష్, స్పైడర్ తో తమిళనాట జెండా ఎగరేసాడు. అయితే మహేష్ కన్నా ముందే అల్లు అర్జున్ దర్శకుడు లింగు స్వామి దర్శకత్వంలో బైలింగువల్ చెయ్యడానికి సిద్దమయ్యాడు. బన్నీ - లింగుస్వామి కాంబోలో స్టూడియో గ్రీన్ వాళ్ళు సినిమాని అధికారికంగా ప్రకటించడమే కాదు పూజ కార్యక్రమాలు కూడా నిర్వహించారు. కానీ సినిమా అధికారికంగా మొదలెట్టినప్పటికీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా సెట్స్ మీదకెళ్ళలేదు. ఒకసారి బడ్జెట్ వలన సినిమా ఆగిపోయిందని... ఆ తర్వాత క్రియేటివ్ ఇష్యూస్ కారణంగా ఈ సినిమా ఆగిపోయింది అన్నారు.
అయితే ఇది నిజమే అన్నట్టు లింగుస్వామి తమిళ హీరో విశాల్ తో సినిమా ప్రారంభిస్తే.. ఇటు అల్లు అర్జున్ కూడా వక్కంతం వంశి దర్శకత్వంలో నా పేరు సూర్య సినిమా స్టార్ట్ చేశాడు. అయితే ఇప్పుడు తాజాగా బన్నీ - లింగుస్వామి కలయికలో సినిమా సెట్స్ మీదకెళ్ళబోతున్నట్టుగా చెబుతున్నారు. అల్లు అర్జున్ నా పేరు సూర్య సినిమా పూర్తి కాగానే లింగు స్వామి ప్రాజెక్ట్ పట్టాలెక్కే ఛాన్స్ ఉందంటున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ ని లింగుస్వామి సినిమా కోసం ఫిబ్రవరి నుంచి కాల్షీట్లు అడిగారట స్టుడియో గ్రీన్ నిర్మాతలు.
అయితే ఫిబ్రవరి నాటికీ అల్లు అర్జున్ నా పేరు సూర్య సినిమా పూర్తికాదని... ఏప్రిల్ నుండి కాల్షీట్స్ కేటాయిస్తానని స్టూడియో గ్రీన్ వారికి అల్లు అర్జున్ చెప్పినట్లుగా వార్తలొస్తున్నాయి. మరి బన్నీ - లింగుస్వామి సినిమా కి కథ, స్క్రీన్ ప్లే ఎప్పుడో రెడీ అయినట్లు దర్శకుడు లింగుస్వామి ప్రకటించేశాడు. మరి అధికారికంగా బన్నీ కూడా తమిళనాట గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేస్తాడన్నమాట.