నందమూరి అభిమానులకి సంక్రాంతి పండుగ చాలా ప్రత్యేకమైనది. నట సింహం నందమూరి బాల కృష్ణ నటించిన చిత్రాలు సంక్రాంతి పండుగకి విడుదల అయితే కచ్చితంగా హిట్ అవుతాయి అనే సెంటిమెంట్ వారిలో బలంగా నాటుకుపోవటం ఇందుకు ప్రధాన కారణం. సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు, లక్ష్మి నరసింహ, గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రాల విజయాలు ఈ సెంటిమెంట్ ని బలపరచటానికి దోహదపడుతున్నాయి. అయితే ఇదంతా నాణానికి ఒకవైపే. మరో వైపు సంక్రాంతి పండుగకి విడుదలైన సీమసింహం, ఒక్క మగాడు, పరమవీర చక్ర వంటి చిత్రాలు డిసాస్టెర్స్ గా నిలిచాయి.
పరమవీరచక్ర అనంతరం సి.కళ్యాణ్ నిర్మాణంలో బాలయ్య బాబు నటించిన చిత్రం కావటం పైగా సంక్రాంతి పండుగకు విడుదల కావటంతో జై సింహ చిత్ర ఫలితంపై అభిమానులలో కొంత ఆందోళన నెలకొంది. ఈ ఆందోళన తొలగించి అంచనాలు పెంచే విధంగా నిర్మాత సి.కళ్యాణ్ సెన్సార్ కార్యక్రమాలు పూర్తయిన అనంతరం చిత్ర విశేషాలు తెలుపుతూ, "బాలయ్య చిత్రాలలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ప్రేక్షకులకి కనెక్ట్ అయితే సినిమా విజయం ఖాయం. జై సింహ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సినిమా కే ప్రధాన ఆకర్షణ. అదే ధైర్యంతో, నమ్మకంతో చెప్తున్నా జై సింహ చిత్రం కచ్చితంగా ప్రేక్షకులని, మరీ ముఖ్యంగా నందమూరి అభిమానులని అలరించే చిత్రం అవుతుంది." అని చెప్పారు.