ఫైనల్ గా నాగ్ కోరిక తీరింది

Update: 2017-11-13 09:00 GMT

నాగ చైతన్య - సమంతలు ప్రేమించి... పెద్దల సాక్షిగా గత నెల 6, 7 తేదీల్లో పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లి కొద్దిమంది అతిధుల సమక్షంలో గోవా వేదికగా జరిగిన విషయం తెలిసిందే. అయితే నాగార్జున.. సామ్ - చైతు ల పెళ్లిని ఎంతో ఘనంగా హైదరాబాద్ లోనే చేద్దామనుకున్నాడు. కానీ వధువు సామ్, వరుడు చైతులిద్దరు తమ పెళ్లిని సింపుల్ గా చేసుకుంటామని నాగ్ ని ఒప్పించడం.. అలాగే చేసుకోవడం కూడా జరిగిపోయాయి. ఇకపోతే పెళ్లి తర్వాత చైతు - సమంత ల రిసెప్షన్ ని అదిరిపోయే లెవల్లో చెయ్యాలని నాగార్జున కంకణం కట్టుకున్నాడు. కానీ నాగ్ కి ఆ అవకాశం ఇవ్వకుండా చాలానే వెయిట్ చేయించారు చైతు, సామ్ లు ఇద్దరు. ఈ మధ్యలో నాగ చైతన్యకి సమంతకి దగ్గుబాటి ఫ్యామిలీ సమక్షంలో ఒక చిన్న గెట్ టు గెదర్ పార్టీతోపాటు... చిన్న సైజు రిసెప్షన్ కూడా జరిగిపోయింది. అలాగే అక్కినేని కుటుంబంలో పూజలు పునస్కారాలతో, మరోవైపు షూటింగ్స్ తో బిజీగా వున్న ఈ జంట పెళ్లి అయిన నెల గడిచాక నాగార్జున చేయ తలపెట్టిన రిసెప్షన్ కి ఒప్పుకోవడంతో నాగార్జున కూడా నిన్న అంటే నవంబర్ 12 ఆదివారం సాయంత్రం టాలీవుడ్ ప్రముఖులతోపాటు... అభిమానుల సమక్షం లో చైతన్య - సమంతల రిసెప్షన్ ని అంగరంగ వైభవంగా నిర్వహించాడు.

ఇక ఈ రిసెప్షన్ కి నందమూరి ఫ్యామిలీ నుండి ఒక్క హరికృష్ణ మాత్రమే హాజరవగా... మెగా ఫ్యామిలీ నుండి రామ్ చరణ్, అల్లు అర్జున్, స్నేహ, చిరంజీవి, వరుణ్ తేజ్ లు హాజరయ్యారు. అలాగే మంచు ఫ్యామిలీ నుండి లక్ష్మి ప్రసన్న ఈ వేడుకకి రాగా... రకుల్ ప్రీత్ సింగ్, రాశి ఖన్నా, లావణ్య త్రిపాఠిలు సందడి చేశారు. అలాగే కృష్ణ, విజయ నిర్మల, కృష్ణం రాజు అండ్ ఫ్యామిలీ, నాని ఫ్యామిలీ కూడా ఈ రిసెప్షన్ కి హాజరై వధూవరులతో ఫోటోలు దిగారు. అలాగే దర్శకుల్లో రాజమౌళి ఫ్యామిలీ సమేతంగా రాగా.. కొరటాల శివ, వంశి పైడి పల్లి, బోయపాటి, సుకుమార్, కళ్యాణ్ కృష్ణ, మారుతీ, చందు మొండేటి తో పాటే తమిళ హీరో కార్తీ, ప్రభులు కూడా హాజరయ్యారు.

ఇక దగ్గుబాటి కుటుంబంలో వెంకటేష్, రానా, సురేష్ బాబులు కుటుంబ సమేతంగా హాజరయ్యి అక్కడ ఏర్పాట్లను పరిశీలించారు. ఇక నాగార్జున ఈ రిసెప్షన్ ఏర్పాట్లను చాలా పకడ్బందీగా నిర్వహించాడు. చైతు, సామ్ లు ఎటువంటి ఇబ్బంది పడకుండా రాత్రి 7 గంటలకు మొదలైన ఈ వేడుకను 10 గంటలకల్లా ముగించేశాడు నాగ్. ఇక అక్కినేని ఫ్యామిలీ మొత్తం ఈ రిసెప్షన్ ఏర్పాట్లను దగ్గరుండి మరీ పర్యవేక్షించారు.. నాగార్జున, అఖిల్, అమల, నాగ సుశీల, సుమంత్, సుశాంత్, సుప్రియాలు అందరూ.. వచ్చిన గెస్ట్ లను పలకరిస్తూ రిసెప్షన్ వేదిక వద్ద హడావిడి చేశారు. మొత్తానికి ఈ విధంగా నాగార్జున కోరిక తీరింది.

Similar News