పవన్ కళ్యాణ్ చక చక సినిమాలను లైన్ లో పెట్టడమే కాదు అంతే స్పీడుగా సినిమాలు తీసేస్తున్నాడు. కాటమరాయుడు చిత్రం పూర్తికాగానే త్రివిక్రమ్ డైరెక్షన్ లో సినిమా మొదలు పెట్టేసాడు. త్రివిక్రమ్ - పవన్ సినిమా షూటింగ్ కూడా శరవేగంగానే జరుపుకుంటుంది. కీర్తి సురేష్, అను ఇమాన్యువల్ హీరోయిన్స్ గానటిస్తున్న ఈ చిత్రంలో ఖుష్బూ, ఇంద్రజ వంటి సీనియర్ హీరోయిన్స్ కూడా నటిస్తున్నారు. అయితే షూటింగ్ మొదలు పెట్టుకుని ఇన్ని నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు ఈ చిత్రానికి టైటిల్ పెట్టలేదు. కానీ రకరకాల టైటిల్స్ మాత్రం ప్రచారంలో వున్నాయి.
అయితే పవన్ గత చిత్రాలు ప్లాప్ అయినప్పటికీ ఇప్పుడు త్రివిక్రమ్ డైరెక్షన్ లో వస్తున్న చిత్రంపై భారీ అంచనాలున్నాయి. వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పటికే రెండు సూపర్ హిట్ చిత్రాలు రావడం ఒకటైతే, పవన్ కున్న క్రేజ్ ఒక ఎత్తు. అందుకే ఈ చిత్రానికి ఇంకా టైటిల్ సెట్ చెయ్యకపోయినప్పటికీ ఈ చిత్రానికి చేస్తున్న బిజినెస్ సంచలనం రేపుతోంది. నైజామ్ లో ఈ చిత్ర హక్కులను రికార్డు ప్రైజ్ కి కొనుగోలు చేశారని చెబుతున్నారు. అలాగే శాటిలైట్ హక్కులు కూడా భారీ ధరకు అమ్ముడుపోయినట్లుగా తెలుస్తుంది. ఇకపోతే సీడెడ్ హక్కులు ఏకంగా రికార్డు స్థాయిలో 16 కోట్లకు అమ్ముడవడం షాక్ ఇస్తుందని అంటున్నారు.
ఇక ఈ చిత్రం మిగతా ఏరియాలన్ని కలిపి దాదాపు 100 కోట్ల పైగా బిజినెస్ చేసిందని చెబుతున్నారు. అయితే ఈ చిత్రం విడుదల దసరాకి ఉంటుందని అన్నారు కానీ ఇప్పుడు మాత్రం నవంబర్ కి షిఫ్ట్ అయినట్లు వార్తలొస్తున్నాయి. ఇటీవలే హైద్రాబాద్ లో షూటింగ్ పూర్తీ చేసుకున్న ఈ సినిమా లేటెస్ట్ గా బల్గెరియా లో షూట్ కోసం వెళ్ళింది.