పాపం రెండో సినిమాకి మళ్ళీ సమస్యలా...?

Update: 2017-07-09 12:00 GMT

అఖిల్ ని టాలీవుడ్ లోకి హీరోగా వి.వి.వినాయక్ డైరెక్షన్ లో 'అఖిల్' చిత్రం ద్వారా గ్రాండ్ గా లాంచ్ చేసాడు నాగార్జున. ఆ సినిమా ఫలితంతో అఖిల్ తోపాటు నాగార్జునకి దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యింది. ఆ దెబ్బకి రెండో సినిమా మొదలు పెట్టడానికి బోలెడంత టైం తీసుకున్నారు. ఇక నాగార్జున అయితే అఖిల్ ని రీ లాంచ్ చేస్తున్నానంటూ ప్రకటించాడు. అయితే ఈ గ్యాప్ లో అఖిల్ తో సినిమా చేస్తున్నారంటూ దాదాపు అరడజను డైరెక్టర్స్ పేర్లు వినబడ్డాయి. కానీ అక్కినేని ఫ్యామిలీ ని తెరకెక్కించిన 'మనం' సినిమా డైరెక్టర్ విక్రమ్ కుమార్ ని అఖిల్ కి రెండో చిత్రానికి డైరెక్టర్ గా సెట్ చేశారు. ఇక అఖిల్ - విక్రమ్ ల చిత్రం ఈ ఏడాది మొదట్లోనే సెట్స్ మీదకెళ్లింది.

అయితే మొన్నటిదాకా షూటింగ్ శరవేగంగా జరుపుకున్న ఈ చిత్రం ఇప్పుడు కాస్త స్లో అయ్యిందని చెబుతున్నారు. కారణం అఖిల్ తో తెరకెక్కిస్తున్న చిత్ర కథ ఇప్పుడు తెలుగులో విడుదలైన మరో చిత్ర కథకి దగ్గరగా ఉండడంతో ఖంగు తిన్న విక్రమ్ కుమార్, అఖిల్ చిత్రాన్ని రీ షూట్ చేస్తున్నాడట. మరి విక్రమ్ కథ ఆ తెలుగు సినిమా కథ ఒకేలా ఉండడంతో ఈ సమస్య వచ్చినట్లు చెబుతున్నారు. అయితే ఆ కథా ఈ కథా ఒక్కటిగా అవడంతో వెంటనే తేరుకున్న చిత్ర యూనిట్ సినిమాలో చెయ్యాల్సిన మార్పులు చేర్పులు చేసేసిందట. మరి కథను మార్చడానికి కొద్దిగా టైం తీసుకున్న విక్రమ్ షూటింగ్ కి కూడా బ్రేక్ ఇచ్చాడని అంటున్నారు.

అసలే మొదటి సినిమాతో దెబ్బతిన్న అఖిల్ ఇప్పుడు రెండో సినిమాకి సమస్యలు చుట్టుకోవడం చూసి నాగార్జున కాస్త ఫీల్ అవుతున్నాడట. ఇంకా షూటింగ్ స్టార్టింగ్ లోనే వుంది కాబట్టి ఎన్ని మార్పులైనా చెయ్యమని డైరెక్టర్ కి సూచిస్తున్నాడట నాగ్. ఇక ఈ చిత్రంలో అఖిల్ కి జోడిగా ఎందరో భామలని అనుకున్నప్పటికీ ఇప్పుడు మాత్రం దర్శకుడు ప్రియదర్శన్ కూతురు కల్యాణి ని అఖిల్ రెండో సినిమా హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు వార్తలొస్తున్నాయి. కానీ అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.

Similar News