ఈ ఏడాది సంక్రాంతి పండుగ టాలీవుడ్ బాక్స్ ఆఫిస్ కి చేదు జ్ఞాపకంగా మిగిలిపోయేలానే కనిపిస్తున్నాయ్ పరిస్థితులు. ఇప్పటికే స్టార్ హీరోస్ చిత్రాలు అజ్ఞ్యాతవాసి, జై సింహ లు మిక్స్డ్ టాక్ తో డీలా పడగా, రాజ్ తరుణ్ నటించిన రంగులరాట్నం కేవలం ఏ సెంటర్ ప్రేక్షకులకి మాత్రమే రుచించే కంటెంట్. సో రంగులరాట్నం బాగా ఆడుతున్నప్పటికీ మాస్ సెంటర్స్ లో సందడి చేసే చిత్రం అవ్వలేదు. ఈ వ్యాక్యూమ్ ని పూడుస్తుంది అని నమ్మిన తమిళ అనువాద చిత్రం గ్యాంగ్ ఆరంభంలోనే చాలా నీరసంగా మొదలై ట్రేడ్ వర్గాలకి నిరాశనే మిగిల్చింది.
సంక్రాంతి పండుగకి తెలుగు సినిమాల సందడి కి అనువాద చిత్రాలు రావటానికి కూడా బయపడతాయి. అలాంటిది ఈ సంక్రాంతి పండుగకి థియేటర్స్ కళకళలాడేలా మన చిత్రాలు పెర్ఫర్మ్ చేయకపోవటంతో విడుదల ఆట నుంచే మంచి స్పందన అందుకున్న గ్యాంగ్ చిత్రానికి ప్లస్ అవుతుందని ఊహించారంతా. తెలుగు హీరోలకి సమానంగా బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడి నెగ్గిన చరిత్ర సూర్యకి ఉండటంతో ఈ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాలలో ఈ చిత్రం నిండా కోటి రూపాయల షేర్ కూడా రాబట్టలేకపోవటంతో సినిమా ఆశించిన విధంగా పెర్ఫర్మ్ చేసే అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. వెలవెలపోతున్న థియేటర్స్ మళ్లీ పుంజుకోవాలంటే గణతంత్ర దినోత్సవం వరకు ఆగాల్సిందేనేమో...