హిందీ సినిమా రంగంలో 40 సంవత్సరాలు దాటిన నటీమణులు కూడా ఇంకా హీరోయిన్లుగానే చేస్తున్నారు. తెలుగులో మాత్రం వయసు పైబడిన వారిని అక్క, వదిన, అమ్మ పాత్రలకే పరిమితం చేస్తున్నారు. ఎవరైనా హీరోయిన్ గా అవకాశం ఇస్తే తప్పకుండా నటిస్తానని భూమిక చావ్లా చెప్పారు.చాలా కాలం తరువాత నాని హీరోగా రూపొందిన ఎంసిఏ చిత్రంలో భూమిక నటించింది. ప్రస్తుతం నాగచైతన్య హీరోగా నిర్మిస్తున్న ‘సవ్యసాచి’ చిత్రంలో కూడా భూమిక నటిస్తోంది.
తెలుగులో చిరంజీవి, నాగార్జున, మహేష్, పవన్ కళ్యాణ్, జగపతిబాబు, సుమంత్ లాంటి హీరోలతో నటించిన భూమిక కొంతకాలం గ్యాప్ తరువాత ఎంసిఏ చిత్రంలో నటించడానికి ఒప్పుకుంది. అయితే ఈ చిత్రంలో నానికి వదినగా నటించి, మెప్పించింది భూమిక. ఇప్పుడు నాగచైతన్యతో సవ్యసాచి చిత్రంలో అక్కగా నటిస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాదులో మీడియాతో మాట్లాడుతూ తన అనుభవాల్ని, అనుభూతుల్ని పంచుకుంది.
యోగా గురువు భరత్ ఠాకూర్ ను వివాహం చేసుకున్న తరువాత ఒక బాబు జన్మించాడు. ఆ బాబు పేరు యాష్. తన వైవాహిక జీవితం సంతోషంగా, సంతృప్తిగా సాగుతుందని, మళ్ళీ నటించాలన్న ఉద్దేశ్యం లేకపోయినా దిల్ రాజు అడగడంతో ఆ పాత్ర నచ్చి ఒప్పుకున్నానని చెప్పింది.
స్నేహితులు, అభిమానులంతా ఇంకా హీరోయిన్ లాగే ఉన్నావని, ఆ మెరుపు తగ్గలేదని అనడం ఆనందాన్నిస్తుందని, అయితే ఆ విషయాన్ని తెలుగు నిర్మాతలు గుర్తించి తనకు అవకాశం ఇస్తే హీరోయిన్ గా నటించడానికి సిద్ధమని భూమిక తెలిపింది. మొదటినుంచీ తాను పాత్ర నచ్చితేనే నటిస్తున్నానని, ఇప్పుడు కూడా హీరోయిన్ కాకపోయినా కథలో ప్రాధాన్యం ఉన్న వాటినే ఎంచుకుంటానని భూమిక చెప్పింది.
తెలుగు సినిమా రంగంలో చాలా మంచి పాత్రలు చేశానని, ఆ తీపి గుర్తులు ఇంకా తన మనసులో ఉన్నాయని భూమిక ఈ సందర్భంగా తెలిపింది.