గత కొన్నాళ్లుగా మంచి కథలను ఎంపిక చేసుకుంటూ, కొత్త దర్శకులని కూడా ప్రోత్సహిస్తూ వరుస హిట్స్ అందుకుంటున్న నేచురల్ స్టార్ నాని తో పెద్ద దర్శకులెవరు సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపడం లేదా? లేదంటే నానినే పెద్ద దర్శకులతో పనిచెయ్యడం లేదా? అంటే అందులో నిజా నిజాలు సరిగా ఎవ్వరికి క్లారిటీ లేదుగాని.. ఇప్పుడు గత రెండు రోజులుగా నాని తో టాప్ డైరెక్టర్స్ ని ముడిపెట్టిన వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. మొన్నటికి మొన్న త్రివిక్రమ్ డైరెక్షన్ లో నాని అన్న మీడియా ఇప్పుడు కొరటాల డైరెక్షన్ లో నాని అంటూ ప్రముఖంగా ప్రచురిస్తున్నాయి.
మరి ఏడెనిమిది సినిమాల హిట్స్ తో ఫుల్ స్వింగ్ లో ఉన్న నాని తన మార్కెట్ ని రోజురోజుకి పెంచుకుంటున్నాడు. కొత్త దర్శకులతో సినిమాలు చేసినా... ప్లాప్ దర్శకులకు అవకాశాలు ఇచ్చినా నాని తీసుకున్న సరైన నిర్ణయంతోనే కాకుండా, నాని కున్న క్రేజ్ కారణంగానే ఆ సినిమాలు ఆడాయనేది జగమెరిగిన సత్యం. మరి నాని ప్రస్తుతం 30 నుండి 40 కోట్ల మార్కెట్ ఉన్న హీరోగా ఎదిగిపోయాడు. ఇలాంటి సమయంలో ఒక టాప్ డైరెక్టర్ తో నాని సినిమా చేస్తే ఆ సినిమాకి విపరీతమైన పాపులారిటీ రావడమే కాదు నాని కూడా స్టార్ హీరో రేంజ్ కి ఎదిగిపోతాడు.
కానీ టాప్ డైరెక్టర్స్ ఎవరు నాని తో సినిమాలు చెయ్యడానికి రెడీగా లేరు. టాప్ డైరెక్టర్స్ అందరూ స్టార్ హీరోలతోనే సినిమాలు చెయ్యడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కానీ... మీడియం రేంజ్ హీరోలతో సినిమాలు చెయ్యడానికి పెద్దగా ఆసక్తిని చూపించడం లేదు. కానీ ఇప్పుడు కొరటాల కన్ను నాని మీద పడిందని... మహేష్ బాబు భరత్ అనే నేను సినిమా కంప్లీట్ కాగానే నాని తో కొరటాల ఒక సినిమా ప్లాన్ చేస్తున్నాడనే టాక్ మాత్రం స్ప్రెడ్ అయ్యింది. ఎందుకంటే కొరటాల కు భరత్ అనే నేను తర్వాత స్టార్ హీరోలెవరు ఖాళీగా లేరు. కొరటాల, చరణ్ తో చెయ్యాల్సిన సినిమా ఆగిపోవడం, ఎన్టీఆర్ తో సినిమా చేద్దామన్నా... ఎన్టీఆర్ రెండు సినిమాల కమిట్మెంట్ తో బిజీ కావడం వలన కొరటాల చూపు నాని వైపు మళ్లిందని అంటున్నారు. అయితే నాని ప్రస్తుతం నటించిన కృష్ణార్జున యుద్ధం విడుదలకు సిద్ధమవుతుండగా.... నాగార్జునతో కలిసి నటించబోయే మల్టీస్టారర్ సినిమా సెట్స్ మీదకెళ్లింది. మరోపక్క కొరటాలకు కరెక్ట్ గా హీరో సెట్ కాకపోవడం వలనే నానితో సినిమా చేద్దామనే ఉద్దేశ్యంతో ఉన్నాడట. చూద్దాం ఈ వార్త ఎంతవరకు నిజమనేది.