ఫీల్ గుడ్ చిత్రాలు తెరకెక్కించటంలో, ఆడవారి కోణంలో నుంచి అందంగా మనసుకి హత్తుకునే కథలని ప్రేక్షకులకి చెప్పటంలో తనదైన శైలిని బ్రాండ్ గా మార్చుకున్న దర్శకుడు శేఖర్ కమ్ముల. ఆయన దర్శకత్వంలో వచ్చిన ఆనంద్, గోదావరి మొదలుకొని ఫిదా చిత్రం వరకు ప్రతి చిత్ర కథ కానీ, కథ లోని అంతర్లీన పొరలు కానీ శేఖర్ కమ్ముల లోని స్త్రీ పక్షపాత ధోరణికి అడ్డం పడుతుంటాయి. అయితే తాను మాత్రం స్త్రీ పక్షపాతిని కాను అని, తాను మనుషుల పక్షపాతినని, అందులోనే స్త్రీ జాతి కూడా ఉంటుంది అని తెలివైన సమాధానం తో ఆకట్టుకుంటున్నారు. దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు ఆర్ధిక పరమైన లాభ నష్టాలతో చిత్ర ఫలితాన్ని పరిగణించలేదని చెప్తున్న శేఖర్ కమ్ముల తన కెరీర్ లో ఇప్పటి వరకు కేవలం ఒక్క వైఫల్యమే ఉందని, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రాన్ని వైఫల్యం అని తాను అనుకోవటం లేదని అంటున్నారు.
ఆనంద్, గోదావరి, హ్యాపీ డేస్ వంటి వరుస విజయాలతో దూసుకుపోతున్న క్రమంలో దగ్గుబాటి రానా ని వెండితెరకి పరిచయం చేసే బాధ్యతని తీసుకుని లీడర్ చిత్రం ద్వారా ఆ బాధ్యతని సక్రమంగా నెరవేర్చినప్పటికీ ఆ చిత్రం కేవలం మల్టీప్లెక్స్ ప్రేక్షకులకి మాత్రమే పరిమితం ఐన సంగతి తెలిసిందే. కాగా తన తదుపరి చిత్రంగా శేఖర్ కమ్ముల తెరకెక్కించిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రం శేఖర్ కమ్ముల అభిమానులని కూడా ఆకట్టుకోలేకపోయింది. తరువాతి కాలంలో హిందీ లో విజయవంతమైన కహాని చిత్రాన్ని తెలుగులోకి అనామిక గా తీసుకు వచ్చి మరోసారి విఫలమైన శేఖర్ కమ్ముల తన కెరీర్ లో ఇప్పటి వరకు ఎదుర్కొన్న తొలి వైఫల్యం అనామిక అని లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రం వైఫల్యంగా తాను పరిగణించటం లేదని స్పష్టం చేశారు.
తాను చేసే చిత్రాలలో చెప్పదలిచిన కథ ప్రేక్షకులకి చెప్పగలిగితే అది విజయం గానే తాను పరిగణిస్తానని చెప్తున్న శేఖర్ కమ్ముల, తనది కాని కథని రీమేక్ రూపంలో అనామిక గా తెరకెక్కించి మాత్రం వైఫల్యం చెందానని ఒప్పుకున్నారు శేఖర్ కమ్ముల.