ధనుష్ హీరోగా తమిళంలో వచ్చిన విఐపి చిత్రం తెలుగులో రఘువరన్ బిటెక్ గా విడుదలై మంచి టాక్ తో పాటు సూపర్ కలెక్షన్స్ కూడా కొట్టేసింది. ఈ ఊపుతోనే తమిళంలో విఐపి కి సీక్వెల్ గా విఐపి 2 ని ధనుష్ నిర్మించి మరీ నటించాడు. ఇక విఐపి 2 ని తెలుగులో కూడా రిలీజ్ చేద్దామనుకుని తెలుగు నిర్మాతలతో బేరసారాలు చేసాడు ధనుష్. ఇక టాలీవుడ్ నిర్మాతలు కూడా విఐపి 2 లో బాలీవుడ్ నటి కాజోల్ కూడా నటిస్తుండడం, విఐపి తో తెలుగులో మంచి కలెక్షన్స్ సాధించిన ఈచిత్రానికి సీక్వెల్ కూడా హిట్టొవ్వచ్చనే ఉద్దేశ్యంతో టాలీవుడ్ నిర్మాతలు విఐపి 2 ని తెలుగు హక్కులు కొనడానికి బాగానే పోటీ పడ్డారు.
విఐపి తో హిట్ కొట్టిన ధనుష్ తెలుగు నిర్మాతలకు 12కోట్ల గూబ గుయ్యమనే రేటు చెప్పడంతో తెలుగు నిర్మాతలు దెబ్బకి సైలెంట్ అయ్యారు. ఇక ధనుష్ మొదటి భాగం మీద ఉన్న నమ్మకంతో స్వయంగా తెలుగులో విడుదల చెయ్యడానికి రెడీ అయ్యాడు. కానీ విఐపి 2 తమిళంలో మాత్రం మొన్న ఆగష్టు 11 న విడుదల చేసి తెలుగులో మాత్రం తర్వాత విడుదల చేద్దామనుకున్నారు. అయితే వీఐపీ తో సూపర్ హిట్ కొట్టిన ధనుష్, విఐపి 2 తో మాత్రం ఆ హిట్ అందుకోలేకపోయాడు. మరి హిట్ కొట్టలేకపోయినా... మొదటి వారం మంచి వసూళ్లతో కోలీవుడ్ లో దూసుకుపోతున్నాడు.
నెగటివ్ టాక్ తో కోలీవుడ్ లో విడుదలైన విఐపి 2 ని తెలుగులో కూడా తమిళ్ వాళ్ళే విడుదల చేసుకుంటున్నారు. మరి అక్కడ టాక్ బాగోకపోయినా... కలెక్షన్స్ పర్లేదు. అలాగే ఇక్కడ మూడు సినిమాలు లై, నేనే రాజు నేనే మంత్రి, జయ జానకి నాయక మూడు సినిమాలు టాక్ బాగున్నా కలెక్షన్స్ బాగోలేదు. మరి ఇలాంటి టైం లో గనక విఐపి 2 ని తెలుగులో విడుదల చేస్తే కనీసం డబ్బింగ్ కి కోసం చేసిన ఖర్చులు కూడా రావనే టాక్ మాత్రం వినబడుతుంది. దీనైపై ధనుష్ ఎలా స్పందిస్తాడో చూద్దాం.