జై లవకుశలో లాజిక్ లేకుండా ఈ సీన్లేంటి? ఓ ప్రేక్షకుడి ప్రశ్న

Update: 2017-09-24 13:00 GMT

జై లవకుశ’ ఎందుకు చూడాలి? కేవలం హీరోయిజం ఉంటే చాలా? నాలుగు పాటలు.. నాలుగు ఫైట్లు ఉంటే చాలా? కథ అవసరం లేదా? కథనంతో నిమిత్తం లేదా? లాజిక్కులతో పని లేదా? హీరో ఇమేజ్ ని బట్టీ... సినిమాపై ఉన్న హైప్ ని బట్టీ... వారం రోజుల్లో డబ్బులొచ్చేస్తున్నాయ్. ఈ పరిణామం వల్ల అది చండాలపు సినిమా అయినా... హిట్ లిస్ట్ లోకి వెళ్లిపోతోంది. నిర్మాతలకు ఇది మంచిదే. కానీ.. అభిరుచి గల ప్రేక్షకుని సినీ దాహం ఎవరు తీరుస్తారు? డబ్బులు తగలేసుకొని నిరాశగా ఇంటిదారి పడుతున్న సినీ ప్రేమికుడి బాధ ఎవరు పట్టించుకుంటారు? డబ్బులొస్తున్నాయ్ కదా! అని చెత్త సినిమాలు తీసి జనాల మీద వదిలే నిర్మాతలకు నేను చెప్పేమాట ఒక్కటే. ఇదే పద్ధతి కొనసాగితే... ఎప్పుడో ఒకప్పుడు శృంగభంగం తప్పదు.. జాగ్రత్త. ప్రకృతి విపత్తు సంభవించి... కుటుంబం చిన్నా భిన్న మైందంటే అర్థం ఉంది. చిన్న అగ్ని ప్రమాదానికి అందరూ విడిపోతారా? లాజిక్కు లేకుండా? అగ్నిప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డ పిల్లాడ్ని బోస్టన్ స్కూల్ లో పడేయడమేంటి.. లాజిక్కు లేకుండా? నాకు తెలీకడుగుతానూ... బోస్టన్ స్కూల్ లో చదువుకుంటే... దొంగే అవుతారా? లాజిక్కు లేకుండా? స్టేజ్ ముందు అపస్మారక స్థితిలో పడిపోయిన పిల్లాడ్ని.. ఆయనెవరో ఎత్తికెళతారట. ఎవరాయన? ఆయనకు వేరే పనిలేదా?

కోటి రూపాయల లోన్ ఎవరైనా ఇస్తారా?

ఊరి చెరువు బాగు చేసుకుంటామూ... కోటి రూపాయలు లోన్ ఇవ్వమంటే... బుద్ధి ఉన్న ఏ బ్యాంక్ మేనేజరైనా ఇస్తాడా? లాజిక్ లేకుండా. సరే... ఏవో దస్తావేజులు కూడా ఇచ్చాడుగా అనుకుందాం. అవేంటి? అవి ఎక్కడి స్థలానివి? దాని రేటెంత? ఇంత తతంగం ఉంటుంది. బ్రహ్మాజీ చెప్పాడని కోటి రూపాయలు ఇచ్చేస్తాడా? లాజిక్ లేకుండా. ఆ మాత్రం కామన్ సెన్స్ లేకపోతే ఎలా? అన్నయ్య ఇష్టపడ్డ అమ్మాయ్ వదిన. కాదంటారా? ఆ అమ్మాయిని సెట్ చేసిపెట్టమని స్వయంగా అన్నే తమ్ముడ్ని అడగడం ఏంటి? చండాలంగా? తమ్ముడెల్లి వదినతో సమానమైన అమ్మాయిని తాను సెట్ చేసుకోవడమేంటి? దరిద్రంగా? నైతిక విలువలతో పనిలేదా? అసలు రావణాసురుడంటే... ఏంటి? వెనక నుంచి ఓ అమ్మాయ్ పొడవబోయింది. చేయిపట్టుకొని చూడగానే... ఆ అమ్మాయ్ నచ్చింది. తర్వాత రావణుడైతే... ఏంచేస్తాడూ..? నిర్దాక్షిణ్యంగా ఎత్తికెళ్లిపోతాడు. తాళి కట్టేసి ఏదో ఒక రూమ్ లో పడేస్తాడు. వాడూ రావణుటంటే.. అంతేకానీ... తమ్ముడ్నిపిలిచి.. ‘నువ్వు నాలాగే ఉంటావ్.. వెళ్లి సెట్ చేసి నాకప్పగించు..’ అనేవాడు రావణుడా?.. పురాణాల్లో కూడా ఇలాంటి చీప్ మెంటాలిటీ ఉన్న రాక్షసుడు కనిపించడు. రావణాసురుడి పరువెందుకు తీశారు?

సినిమాలో ఇన్ని బొక్కలా?

కారులో బాంబు పెట్టినట్టు.. ‘జై’ అనుకోని... డైరెక్ట్ గా కుశకుమార్ కే చెప్పేశాడు సాయికుమార్. సరే.. నువ్వంత త్యాగమూర్తివైతే... ఆ కారులో నువ్వొక్కడివే వెళ్లు..! లవకుమార్ ని ఎందుకు ఎక్కించుకున్నావ్? వాడ్నెందుకు చంపడం? ఎప్పుడో చిన్నప్పుడు విడిపోయారు. కలిసి కూడా పెరిగింది లేదు. మరి వాడేం పాపం చేశాడని ఆ కారులో లవకుమార్ ని ఎక్కించుకున్నాడు కుశుడు. ఏంటో... ఇన్ని బొక్కలు ఒకే సినిమాలో ఉండటం.. నేను ఈ మథ్యకాలంలో చూడలేదు. ఎన్టీయార్ కాకుండా ఇంకెవరైనా ఈ సినిమా చేస్తే... రెండోరోజుకే థియేటర్లు ఉండేవి కావ్. ఇన్ని లోపాలతో వచ్చిన సినిమాలను హిట్ చేస్తే... భయం లేకుండా తయారవుతారు. ఎవరో ఒకరు ప్రశ్నించాలి కదా. అందుకే... ఇలా. అని ప్రేక్షకుడు సూటిగా ప్రశ్నిస్తున్నాడు.

Similar News