విజయాపజయాలకి అతీతంగా హీరో ఇమేజ్ ల చక్రంలో పడి సినిమా చూడని ప్రేక్షకులు, గొప్ప ప్రయత్నాల్ని, కొత్త దనాన్ని ఆస్వాదించే ప్రేక్షకులందరికీ అభిమాన దర్శకుడు సుకుమార్ అనటంలో ఎలాంటి సందేహం ఉండదు. ఆయన తెరకెక్కించిన చిత్రాలలో ఆడిన చిత్రాల కంటే సరిగ్గా ఆడని చిత్రాలు జగడం, 1 నేనొక్కడినే కి ఉన్న ప్రత్యేక గౌరవమే ఇందుకు నిదర్శనం. సుకుమార్ దర్శకత్వం వహించిన నాన్నకు ప్రేమతో చిత్రం విడుదలై ఇప్పటికే రెండు సంవత్సరాలు పూర్తి కావటంతో ప్రస్తుతం సుక్కు తెరకెక్కిస్తున్న రంగస్థలం కోసం అభిమానుల నిరీక్షణ తారాస్థాయికి చేరుకుంటోంది. ముందుగా అనుకున్న ప్రణాళిక ప్రకారం సంక్రాంతి పండుగకు విడుదల కావలసిన రంగస్థలం మధ్యలో సమంత వివాహం కారణం చేత, మరియు సైరా నరసింహారెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్న రామ్ చరణ్ తేజ్ ఆ చిత్రం మొదలుపెట్టే క్రమంలో రంగస్థలం షూటింగ్ కి కొద్దిగా బ్రేక్ ఇవ్వటం కారణంగా విడుదల ఆలస్యమై మార్చ్ 30 కి వాయిదా పడింది.
ప్రతి సారి హీరో పాత్ర రూపకల్పన లో తనదైన ప్రత్యేకతని చూపే సుకుమార్ రంగస్థలం కోసం దశాబ్దాల వెనక్కి వెళ్లి పీరియాడిక్ లవ్ స్టోరీ చెప్తూ అందులో రామ్ చరణ్ తేజ్ ని చిట్టి బాబు అనే ఒక పల్లెటూరి యువకుడిగా చూపించబోతున్నారు. వినికిడి లోపంతో కనిపించే చరణ్ ఎదుటి వారి పెదాల కదలికలు గమనించి వారి మాటని అర్ధం చేసుకునే లిప్ రీడింగ్ తెలిసిన వ్యక్తిగా కనిపించబోతున్నట్టు సమాచారం. ఈ చిత్రంపై మరిన్ని విశేషాలు ఈ నెల 24 న వస్తున్న టీజర్ ద్వారా రెవీల్ అయ్యే అవకాశాలు వున్నాయి.