కేవలం మహేష్ కోసమే!!

Update: 2017-08-01 05:00 GMT

మహేష్ - మురుగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'స్పైడర్' చిత్రం మార్కెట్లో సందడి షురూ చేసింది. ఆగష్టు రెండున ఒక సాంగ్ లిరిక్ తోపాటు దాని మేకింగ్ కి ముహూర్తం పెట్టేసారు. ఈ దెబ్బకి మహేష్ అభిమానులు మామూలు పండగ చేసుకోవడంలేదు. ఇక ఈ చిత్రంలో మహేష్ కి జోడిగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుండగా... తమిళ నటులు ఎస్ జె సూర్య, నటుడు భరత్ లు కీలక రోల్స్ పోషిస్తున్నారు. అయితే ఎస్ జె సూర్య ఈచిత్రంలో మహేష్ కి విలన్ గా కనిపించనున్నాడు. అలాగే ఈ స్పైడర్ చిత్రంలో మరో విలన్ గా భరత్ కనబడుతున్నాడనే సమాచారం బయటికి వచ్చింది.

అయితే హీరో భరత్ కేవలం తాను మహేష్ కోసమే విలన్ గా మారానని... అందులోను ఈ ఒక్క సినిమాలోనే విలన్ గా కనబడతానని.. మరే ఇతర సినిమాలో ఇక విలన్ రోల్ చెయ్యనని చెబుతున్నాడు. స్పైడర్ లో భరత్ ఎలా వుండబోతున్నాడో... ఆ పాత్ర తీరు ఎలా వుండబోతుందో ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు భరత్. మరిన్ని ఆసక్తికర విషయాలను ఈ ఇంటర్వ్యూలో వివరించాడు భరత్. స్పైడర్ షూటింగ్ మొదలైన కొద్దీ రోజులకే తనకి డైరెక్టర్ మురుగదాస్ ఫోన్ చేసి స్క్రిప్ట్ వినిపించి విలన్ గా చెయ్యాలని కోరగా... తెలుగులో డైరెక్ట్ గా నటించడం, సూపర్ స్టార్ మహేష్ సినిమాలో విలన్ పాత్ర అనేసరికి కాదనలేకపోయినట్లు చెప్పాడు. ఇక తెలుగులో తన పాత్రకి తానె స్వయంగా డబ్బింగ్ కూడా చెప్పుకున్నాడట భరత్.

ఇక స్పైడర్ లో భరత్ - మహేశ్ ల మధ్య ఓ రోలర్ కోస్టర్ పై ఫైటింగ్ సీన్ ఉంటుందట. ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ దాదాపు 15 రోజుల పాటు చిత్రీకరించిన ఆ ఫైట్ సీన్ స్పైడర్ సినిమాకే హైలైట్ గా నిలుస్తుందట. ఇక ఈ చిత్రం తన కెరీర్లో ఎప్పటికీ గుర్తుండిపోతుందని భరత్ చెబుతున్నాడు.

Similar News