ఒక్కో చిత్రంతో ఉనికి కోల్పోతున్న బాద్షా

Update: 2018-01-01 16:40 GMT

ఒక దశాబ్ద కాలంగా విదేశాలలో భారతీయ చిత్రాలు అంటే తెలుగు, తమిళం, మలయాళం, బెంగాలీ వంటి భాషా చిత్రాలకి గుర్తింపు దక్కుతుంది కాని అనాదిగా భారతీయ చిత్రాలు అంటే విదేశీయులకి కేవలం బాలీవుడ్ మాత్రమే పరిచయం. అందుకే దక్షిణాది నటులలో ఒక్క సూపర్ స్టార్ రజని కాంత్ కి మినహాయిస్తే మరే ఇతర ప్రముఖ కథానాయకులకు కూడా బాలీవుడ్ కథానాయకులకు వున్న అంత గుర్తింపు ఉండేది కాదు. మరీ ముఖ్యంగా ఖాన్ త్రయం కి విదేశీ మార్కెట్ లో స్వదేశీ మార్కెట్ కి ధీటుగా వసూళ్ల వర్షం కురుస్తుండేది. అయితే ఆ క్రెడిబిలిటీ ని సుస్థిరపరచుకుంటూ ఆమిర్ ఖాన్ వినూత్న ప్రయోగాలతో, సల్మాన్ ఖాన్ వాణిజ్య చిత్రాలతో దూసుకుపోతుంటే మరో వైపు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ పరిస్థితి మాత్రం రెంటికి చెడ్డ రేవడిలా మారింది.

హ్యాపీ న్యూ ఇయర్, డియర్ జిందగీ, దిల్ వాలే, ఫ్యాన్ వంటి వరుస పరాజయాల నుంచి రాయిస్ చిత్రం కొంత ఊరట కలిపించినప్పటికీ స్వదేశీ, విదేశీ మార్కెట్లలో షారుఖ్ ఖాన్ హిట్ చిత్రాల స్థాయికి సరితూగే వసూల్లని సాధించలేకపోయింది. రాయిస్ తరువాతి చిత్రం జబ హ్యారీ మేట సేజల్ ని విపరీతంగా ప్రమోట్ చేసినప్పటికీ కనీసం మల్టీప్లెక్స్ లలో కూడా పూర్తిగా పాజిటివ్ టాక్ కి నోచుకోలేక బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది ఆ చిత్రం. ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్ లతో పాటు జాలీ ఎల్.ఎల్.బి, టాయిలెట్ ఏ ప్రేమకథ వంటి చిత్రాలతో అక్షయ్ కుమార్, గోల్మాల్ సిరీస్ తో అజయ్ దేవగన్ వంటి సీనియర్ హీరోస్ అంతా భారీ వసూళ్లతో సత్తా చాటుతుంటే బాద్షా షారుఖ్ ఖాన్ మాత్రం అభిమానులని నిరాశపరుస్తూనే వున్నాడు. ఇప్పటికైనా స్టార్ స్టేటస్ మోజులో కథలని ఎంచుకునే ప్రక్రియ మానుకుని తన సమకాలీన హీరోల పంథాలోకి వెళ్లి ప్రయత్నిస్తే షారుఖ్ విజయావకాశాలు మెరుగుపడే అవకాశాలు లేకపోలేదు.

Similar News