సినిమా మరియు రాజకీయ రంగాలలోని ప్రముఖులు పరస్పరం ఒకరి శ్రేయస్సుకి మరొకరు శ్రమిస్తుంటారు. ఎన్నికల సమయాలలో ప్రచారానికి సినిమా గ్లామర్ కోరుకునే రాజకీయ పార్టీలు సినిమా ప్రముఖుల్ని తమ పార్టీ ప్రచారానికి వినియోగించుకోవటం, సినిమా పరిశ్రమకి వచ్చే కష్టాలకి రాజకీయ ప్రముఖులు తమ అధికారం వినియోగించి సినిమా పరిశ్రమకి సహకరిస్తుండటం చాలా కాలం గా చూస్తున్నాం. అయితే ఇప్పుడు ఈ పరస్పర సంబంధాలని నిర్మాతలకి కాసులు కురిసే విధంగా మార్చేస్తున్నారు రాజకీయ సంబంధాలు వున్న హీరోలు.
అధిక పారితోషికాల వల్ల పెరిగిపోతున్న నిర్మాణ వ్యయాన్ని నిర్మాత చిత్రం విజయాపజయాలకి అతీతంగా విడుదల ముందే రాబట్టుకోవాలంటే పంపిణీదారులకి ఫ్యాన్సీ రేట్లకి విక్రయించాలి. ఇలా విక్రయించాలంటే అంత మొత్తం రికవరీ సాధ్యమేనని భావన పంపిణీదారుడికి కలిగించాలి. అందుకే తొలి వారం అదనపు షోస్ కి ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతులు, పెయిడ్ ప్రీమియర్స్ కి అనుమతులు తెప్పించి పంపిణీదారులని టెంప్ట్ చేస్తున్నారు. సంక్రాంతి విడుదలలకి అదనపు షో ల అనుమతి ఉన్నప్పటికీ ఎక్సిభిటర్స్ రోజుకి నాలుగు షో లు మించి ప్రదర్శించటానికి సాహసించలేకపోతున్నారు. రోజుకి నాలుగు ఆటలు నిండటమే కష్టంగా వున్న సినిమాల టాక్ కారణంగా అదనపు షో లు ప్రదర్శించి కరెంటు బిల్ మందాన కూడా వసూళ్లు ఉండని నేపథ్యంలో ఘోర ఆర్ధిక నష్టాలని ఫిక్స్డ్ హైర్స్ ఇచ్చి కొనుక్కున్న ఎక్సిభిటర్స్ తో పాటు రెంట్ లకి, పర్సెంటేజ్ లకి ఆడించుకుంటున్న పంపిణీదారులకి అదనపు షో ల నిర్వహణ తలకి మించిన భారమే అవుతోంది.