ఆదాయపు పన్ను చెల్లింపులలో ఎదురయ్యే సమస్యల కారణంగా టాప్ స్టార్స్ ఎవరూ తమ పారితోషికాల విషయంలో గోప్యత వీడటానికి ఇష్టపడరు. ప్రస్తుతం భారత దేశంలో టాప్ ట్రేండింగ్ లో వున్న చిత్రం పద్మావత్. విడుదలకి ముందు నెలకొన్న సందిగ్ధత కారణంగా నటీనటులు కానీ సాంకేతిక వర్గంలోని ప్రముఖులు కానీ ఎలాంటి ప్రచార కార్యక్రమాలు తలపెట్టలేదు. సినిమా విడుదలై భారీ విజయం దిశగా పరుగులు తీస్తుండటంతో పాటు ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ పెద్దలు కూడా ప్రశంసలు కురిపించటం, సుప్రీమ్ న్యాయస్థానం సైతం పద్మావత్ పక్షాన నిలబడటంతో సినిమాలో టైటిల్ రోల్ పోషించిన దీపికా పదుకొనె బాలీవుడ్ ఛానెల్స్ లో పలు కార్యక్రమాలలో ప్రొమోషన్స్ కి ముందుకు వస్తుంది.
తాజాగా నేహా ధూపియా షో కి అతిధిగా వచ్చిన దీపికా పదుకొనె తో రాపిడ్ ఫైర్ ఆడిన నేహా ధూపియా పద్మావత్ చిత్రానికి గాను తాను అందుకున్న పారితోషికం విషయమై పలు ప్రశ్నలు సంధించింది. ఈ ఆట లో భాగంగా అతిధి అయితే జవాబు ఇవ్వాలి లేదా తన శరీరం పై వున్న ఆభరణాలలో ఏదో ఒకటి తీసి వేయాలి. ముందుగా పారితోషికం ఎంత అని అడిగిన ప్రశ్నకి జవాబు ఇవ్వటానికి నిరాకరించిన దీపికా తన ఇయర్ రింగ్స్ తీసి టేబుల్ పై పెట్టగా, మరో విధంగా ప్రయత్నించినా నేహా, రణ్వీర్ సింగ్ మరియు షాహిద్ కపూర్ ల కంటే అధిక పారితోషికం పుచ్చుకున్నారని సమాచారం వుంది. అది నిజమేనా అని అడగగా, నిజమే అంటూ బదులిచ్చింది తప్పితే అసలు పారితోషికం మాత్రం బైటపెట్టకుండానే జారుకుంది దీపికా పదుకొనె.