ఈమె కూడా బాలీవుడ్ చెక్కేసే ప్లాన్లోనే ఉన్నట్టుంది

Update: 2018-01-17 08:00 GMT

కెరటం అనే చిత్రంతో తెలుగు చలన చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో తన రెండవ చిత్రం వెంకటాద్రి ఎక్ష్ప్రెస్స్ లో తాను పలుమార్లు చెప్పిన 'ప్రార్ధన.. ప్రతి రూపాయి కౌంట్ ఇక్కడ' అనే డైలాగ్ తో ప్రేక్షకులని బాగా ఆకట్టుకుని, అదృష్టవశాత్తు ఆ చిత్రం విజయం పొందటంతో శ్రమకి తగ్గ ఫలితంతో పాటు ఊహించని గుర్తింపు తెచ్చుకుంది. ఆ గుర్తింపుతోనే అనతి కాలంలోనే వరుసగా రవితేజ, రామ్ చరణ్ తేజ్, తారక్, అల్లు అర్జున్, అక్కినేని నాగ చైతన్య, మహేష్ బాబు వంటి అగ్ర కథానాయకుల సరసన నటించేసింది.

గత ఏడాది సెప్టెంబర్ ఆఖరున విడుదలైన స్పైడర్ చిత్రం అనంతరం రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పటి వరకు మరే తెలుగు సినిమా షూటింగ్స్ లో పాల్గొనలేదు. అలా అని అవకాశాల కొదవ లేనప్పటికీ బాలీవుడ్ సినిమాల మోజులో బొంబాయి లోనే అధిక సమయం గడుపుతున్న రకుల్ తెలుగు ఆఫర్స్ అన్నిటిని ఒప్పుకోవటం లేదు. రకుల్ నటించిన హిందీ చిత్రం అయ్యారే ఫిబ్రవరి 9 న ప్రపంచవ్యాప్తంగా విడుదలకి సిద్ధం అవుతుండగా రంజన్ అనే దర్శకుడు తెరకెక్కిస్తున్న మరో హిందీ చిత్రంలో రకుల్ ప్రధాన పాత్ర పోషించనుందని స్వయంగా తానే ప్రకటించింది. అజయ్ దేవగన్, టబు ప్రధాన పాత్రధారులుగా ఈ చిత్రం తెరకెక్కబోతోంది. చూస్తుంటే ఇలియానా మాదిరిగానే రకుల్ కూడా బొంబాయి కి పరిమితం కాబోతున్నట్టుందే.

Similar News