ఎన్.టి.ఆర్ పై బైయోపిక్ అంటూ 'లక్ష్మీస్ వీరగ్రంధం' అనే టైటిల్ అన్నౌన్స్ చేసి లక్ష్మి పార్వతి తో జరిగిన వాగ్విదాంతో వార్తల్లో నిలిచిన దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి అసలు ఆ బైయోపిక్ తీస్తారో లేదో తెలియదు, అసలు ఆయన అది హేండిల్ చేయగల సమర్ధులా కాదా అనేది కూడా తెలియదు కానీ ఇప్పుడు అనవసరమైన అనుచిత వ్యాఖ్యలతో డైరెక్టర్ అని పిలిపించుకునే అర్హతనే కోల్పోతున్నారు కేతిరెడ్డి. బాలీవుడ్ లో అనౌన్సమెంట్ జరిగిన ఒక ప్రాజెక్ట్ కాస్టింగ్ పై అనవసరమైన అభ్యంతరాలు తెలియజేస్తూ వార్తల్లో నిలిచే తాపత్రయంతో అవాసుపాలవుతున్నాడు కేతిరెడ్డి.
ఇటీవల అనౌన్స్ చేయబడ్డ 'ఇందిరా: ఇండియాస్ పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్' అనే ఇందిరా గాంధీ లైఫ్ స్టోరీ పై రాబోతున్న ప్రాజెక్ట్ కి సంబంధిత నిర్మాణ సంస్థ రాయ్ కపూర్ ప్రొడక్షన్స్ ఇందిరా గాంధీ పాత్ర ప్రముఖ నటి విద్య బాలన్ పోషించనున్నట్టు ప్రకటించారు. ఈ కాస్టింగ్ విషయంలో తన అభ్యంతరాలని పేస్ బుక్ పోస్ట్ ద్వారా రాయ్ కపూర్ ప్రొడక్షన్స్ కి ఉచిత సలహాలు ఇస్తూ వార్తల్లో నిలిచాడు కేతిరెడ్డి. ది డర్టీ పిక్చర్ లాంటి చిత్రంలో గ్లామర్ షో చేసిన నటిని మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రకి ఎంచుకోవటం సమంజసం కాదని, ఒకటికి పది సార్లు కాస్టింగ్ విషయంలో ఆలోచించుకోవాలని పేర్కొంటూ కేతిరెడ్డి తెలిపిన అభిప్రాయాలపై నెటిజన్లు కామెంట్స్ రూపంలో సరైన సమాధానమే చెప్తున్నారు. ఒక పాత్రతో మెప్పించి ఇంతలోనే ఆ పాత్రకి విరుద్ధమైన పాత్రలలో కూడా మెప్పించటమే వృత్తిగా పనిచేసే వారే నిజమైన నటీనటులు. అలాంటి ప్రతిభ కలిగిన విద్య బాలన్ ని ఎంచుకున్న నిర్మాతలకి సలహాలు ఇవ్వటానికి నటుల గత పాత్రలని బేరీజు వేసుకుంటూ వారు ఇతర పాత్రలకి అర్హులు కారని చెప్తున్న కేతిరెడ్డి అసలు కళారంగానికి అనర్హుడు అని అభిప్రాయపడుతున్నారు నెటిజన్లు.